సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" నను బ్రోవమని చెప్పవే
సీతమ్మ తల్లి...."
వివేకానందులు అంటారు " ప్రపంచవాజ్మయం అంతా నాశనమయిపోయినా ఒక్క రామాయణం ఉన్నా లేక ఒక్క సీతమ్మను జ్ఞప్తిలో ఉంచుకున్నా భారతజాతి ( సనాతనధర్మం ) మరి కొన్నివేల సంవత్సరాలవరకూ నిలిచి ఉంటుంది " అని. ఎందుకని అంటే " శ్రీరాముడు లాంటి అందగాడు, ధీరోదాత్తుడు, ధర్మపరుడు ఇంకొకరు కనబడవచ్చు శ్రద్ధగా వెదికితే కాని సీతమ్మలాంటి స్త్రీ మాత్రం దొరకదు కాక దొరకదు " అని ఆయన నొక్కి వక్కాణించారు.
అమ్మ కౌసల్యను అనునయించి ఒప్పించిన తరువాత రాముడు సీతమ్మ దగ్గరకు వెడతాడు ఆవిడను కూడా అనునయించి అరణ్యవాసానికి బయలుదేరడానికి. " మా తండ్రి నన్ను వనవాసానికి వెళ్ళమన్నారు " అని మాత్రం అనగానే సీతమ్మ " నేను కూడా మీతో పాటే " అంది. మిమ్మల్ని అనుసరిస్తాను అనలేదు. మీముందుండి మీమార్గంలో ఉండే ముళ్ళు రాళ్ళు తొలగిస్తూ మీమార్గం సుగమం చేస్తాను అంది తల్లి.
ఇక్కడ సీతమ్మ ఒక ధర్మసూక్ష్మం తెలియచేసింది జాతికి. తల్లిదండ్రులు, తోబుట్టువులు, సంతానం ఎవరికయినా ఎవరి భాగ్యం వారిదే, ఎవరి కష్టాలు వారివే. కాని ఒక్క భార్యాభర్తలదే ఒకరి భాగ్యం ఇంకొకరిది. సుఖాలలోనే కాదు, కష్టాలలో కూడా ఒకరికి ఒకరు తోడు.
అదీ మన రామాయణం/సనాతనధర్మం మనకు తెలియచేసిన జీవితసత్యం.
అదీ సీతమ్మతల్లి ఔన్నత్యం. అందుకే విశ్వనాధ సత్యనారాయణగారు తను వ్రాసిన రామాయణ కల్పవృక్షంలో అంటారు " నీ చరణ రవ్వదువ్వ శిరసా పరిధార్యము స్త్రీ జగత్తుకున్ " అని. " ఓ సీతమ్మా, నీ కాలిధూళి స్తీజాతి అంతా నుదిటిన బొట్టుగా పెట్టుకోవాలి " అని. సీతమ్మ మాటలు అంత అద్భుతం రామాయణంలో.
మహాసాధ్వి, మణిపూస. రోజుకు ఒక్కసారి తలచుకున్నా జీవితం పావనమవుతుంది. సంశయం నాస్తి - సూర్య.
శుభం భూయాత్
🙏
ReplyDelete