కొందరు " స్వయం " పీఠాధిపతులు వివాదాస్పదులు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే " - భ.గీత 3:21 " మహనీయుడయిన వ్యక్తి ఎట్టి కార్యములను చేయునో వానిని సామాన్యజనులు అనుసరింతురు. తన ఆదర్శప్రాయ కర్మము ద్వారా దేనిని అతడు ప్రమాణముగా నిర్ణయించునో దానినే లోకమంతయు అనుసరించును " అని తెలియచేసారు పరమాత్మ. " యధా రాజా తధా ప్రజా " అని సామెత. రాజు ఆదర్శప్రాయుడిగా ఉండాలి. అప్పుడు ప్రజలు కూడా బాధ్యతగా మసలుతారు. రాముడు అందుకే ఆదర్శపురుషుడు అయారు. వేలసంవత్సరాలుగా పూజింపబడుతున్నారు. గురువుమాట వేదవాక్కు. వశిష్టుడు వారి కులగురువు. తిరిగివచ్చి రాజ్యాన్ని స్వీకరించమని ఎవరు చెప్పినా రాముడు వినకపోవడంతో వశిష్టుడిని నచ్చచెప్పమంటారు. " తండ్రి మరణించాక పెద్దకుమారుడు రాజ్యాన్ని స్వీకరించి పాలనచెయ్యడం శాస్త్రసమ్మతమే కాని అధర్మం కాదు, వచ్చి రాజ్యాన్ని స్వీకరించు " అని వశిష్టుడి చెప్పినా రాముడు ఒప్పుకోలేదు. " అది ఋజువర్తనం కాదు, అలా నాలాంటివారు చేస్తే ప్రకృతి ( సూర్యుడు, భూమి, గాలి, నీరు వంటివి ) సహకరించదు, కరువుకాటకాల...