మనకు మనమే మిత్రులం, శతృవులం - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః ! అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ " - భ.గీత 6:6 " మనస్సును, ఇంద్రియములను, శరీరమును జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు. అట్లు జయింపనివాడు తనకు తానే శత్రువు " అన్నారు పరమాత్మ. అనగా జితేంద్రియునకు మనస్సు, ఇంద్రియములు, శరీరము భగవత్ప్రాప్తిసిద్ధికై మిత్రునివలె సహకరిస్తాయి . జితేంద్రియుడు కానివానికి మనస్సు, ఇంద్రియములు,శరీరము శత్రువులవలె ప్రవర్తించి లక్ష్యసాధనకు అవరోధకములుగా నిలుస్తాయి. ఎంత అద్భుత విషయం. మనస్సు ఇంద్రియములు అదుపులో ఉంచుకుంటే జీవితం ఆనందమయంగా సాగిపోతుందని, ఏ కష్టాలు దరిచేరవని ఎంత చక్కగా తెలియచేసారు పరమాత్మ. వాల్మీకి రామాయణంలో ఓ అద్భుత ఘట్టం ఉంది. " ఇంద్రియాణి పురాజిత్వా జితం త్రిభువనం త్వయా స్మరద్భిరివ తద్వైరం ఇంద్రియైరేవ నిర్జితః " రావణుడు మరణించగానే మండోదరి అంటుంది రావణుడిని ఉద్దేశించి " ఇంద్రియాలు నీ అధీనంలో...