శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
శ్రీసరస్వతీదేవి " పుట్టినరోజు నేడు. శ్రీపంచమి/వసంతపంచమి/మాఘపంచమి అని వేడుక చేసుకుంటారు భక్తులు.
" సరస్వతీ " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాల్లో 704 వ నామం.
" సరస్వతీ " అంటే జ్ఞానాధిష్టానదేవత. అంటే అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేది. అజ్ఞానం తొలగుతే సచ్చిదానందమే కదా.
" విద్యా దదాతి వినయం,
వినయాత్ యాతి పాత్రతాం,
పాత్రత్వాత్ ధనమాప్నోతి,
ధనాత్ ధర్మం తతో సుఖం "
అని చెబుతూంది నరసింహ సుభాషితం .
ఏ జీవి అయినా సుఖాన్నే కోరుకుంటాడు, ఆఖరికి మరణంలో కూడా. ఈ సుఖానికి మూలం విద్య అని తెలుసుకోవాలి. విద్యనుంచే వినయం, అర్హత, ధనం, ధర్మం, సుఖం వరుసగా లభిస్తాయి. ఈనాడు మధ్యతరగతివారి జీవితాలు సుఖమయంగా ఉన్నాయంటే విద్యవలనే అని అర్ధం అవుతూంది.
ఇక్కడ విద్య నుంచి వినయం అన్నారు. వినయం అంటే అందరూ అనుకునేది కాదు. ఆదిశంకరులు వినయః అంటే ఉపశమః అని భాష్యం చెప్పారు. అంటే శాంతి. మన పూర్వపు విద్య శాంతిని కలిగించేది. జీవితం సుఖంగా ఉండేది. ఇప్పటి విదేశీవాడు పెట్టిన చదువులు " అశాంతి " ని కలిగిస్తున్నాయి. అందుకే యువత నిస్పృహలో ఉండి పోతూంది.
ఈ శాంతిని కలిగించే విద్యని ప్రసాదించే అమ్మవారు సరస్వతి.
వేదాలలో ( ఋగ్వేదం ) మొదట ప్రస్తావన వచ్చేది సరస్వతి అమ్మవారి గురించే. ఆవిడ సంస్కృతభాషకు అమ్మ. అక్షరాలకు అధిదేవత. అక్షరం అంటే క్షరం/నాశనం లేనిది అని అర్ధం. అందుకే విద్యారంభంలో సరస్వతిని పూజిస్తారు. అమ్మవారిని వాగ్దేవి ( వాక్ + దేవి ) గా కొలుస్తారు. శుద్ధమయిన మాటనిస్తుంది. శుద్ధమయిన నీరులా పవిత్రతనిస్తుంది. సరస్వతీనది ప్రస్తుతం అంతర్వాహినిగా ఉంది.
మహాభారతయుద్ధం అయిపోయాక వికలమైన మనస్సుతో దండకారణ్యం లోని గోదావరీ తీరానికి వచ్చారు వ్యాసమహర్షి. మానసిక ప్రశాంతతకోసం మహాసరస్వతీదేవిని ప్ర్రార్ధనచేస్తూ చాలాకాలం తపస్సుచేసారు. ఆ ప్రదేశం వాసర గా పిలువబడి ప్రస్తుతం బాసరగా ప్రసిద్ధిచెందింది. ఈమె మానసికప్రశాంతతని ఇస్తుంది. జీవుడికి అంతకన్నా కావలిసినది ఏముంటుంది.
కార్తీకపురాణంలో ఒకానొక సందర్భంలో సరస్వతీదేవి అంటుంది గాయత్రీదేవితో:
" అపూజ్యా యత్రపూజ్యంతే
పూజానాంచ వ్యతిక్రమః,
త్రీణి తత్ర భవిష్యంతి
దుర్భిక్ష్యం మరణం భయం "
అంటే " ఎక్కడైతే పూజార్హతలేనివారు పూజింపబడుతారో, పూజనీయులు పూజింపబడడంలేదో అక్కడ కరువు, మరణం, భయం అనే 3 విపత్తులు కలుగుతాయి " అని.
ప్రస్తుత పరిస్థితులకి అద్దం పడుతూంది ఈ విషయం.
అమ్మవారి అనుగ్రహంతో వాల్మీకి, వ్యాసమహర్షి, కాళిదాసు, పోతన మొదలగువారు పసిద్ధులయ్యారు. వీరందరూ కూడా " నీ అనుగ్రహంలేకపోతే ఏమి వ్రాయగలమమ్మా " అని పూజించేవారుట అమ్మవారిని.
ఈ రోజు సరస్వతీ దేవి పుట్టినరోజు. శుభాకాంక్షలు అందరికీ.
అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి, మానసికప్రశాంతతని ఇచ్చి, మనందరి జీవితాలు సుఖమయం చేయమని " సరస్వతీ " అమ్మవారిని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment