ఏ జన్మ అయినా ఈశ్వరుడి ధ్యానంలో గడిపితే నష్టం లేదు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 " నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకతా, పశుత్వం కీటత్వం భవతు విహగత్వాదిజననం, సదా తత్పాదాబ్జస్మరణ పరమానందలహరీ, విహారాసక్తం చేత్ హృదయమిహ కిం తేన వపుషాం " -10 " మనుష్యునిగా, దేవుడుగా, పర్వతంగా, వనంగా, మృగంగా, దోమగా, పశువుగా, పక్షిగా కాని పుట్టినా ఆ ఆ పుట్టుకలందు నీ పాదపద్మాలను భావించడం అనే ఆనందనదిలో ఈదులాడే తలపు ఉన్నచో ఏ పుట్టుక అయినా లోటేముంది " అని. ఈ శ్లోకం శంకరాచార్య విరచిత శివానందలహరి లోనిది. ఏ పుట్టుక అయినా శివుడి ధ్యాసలోనే ఉన్నవారు చరితార్ధులవుతారు అని భావించాలి. "జంతూనాం నరజన్మ దుర్లభం" అన్నాయి శాస్త్రాలు. కాని శివునిధ్యాసలో లేనప్పుడు ఆ నరజన్మ వ్యర్ధం కదా. దేవతలకయినా ఇదే వర్తిస్తుంది. కుబేరుడు ప్రతిదినమూ ఇద్దరిని దర్శించుకుని పూజిస్తారుట. ఒకరు శివుడు, ఐశ్వర్యప్రదాత, సంపదకోసం. రెండు వెంకటేశ్వరుడు - తను అప్పుగా ఇచ్చిన ధనాన్ని వసూలు చేసుకోవడానికిట. కొన్ని కొండలు ఉంటాయి - అరుణాచలం, సింహాచలం, భద్రాచలం, వేంకటాచలం (తిరుమల), రత్నాచలం (అన్నవరం ) మొ.గునవి. కొండగా పుడిత...