శ్రీ ఆదిశంకరుల జయంతి నేడు, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ
🙏 "శ్రీమాత్రేనమః" 🙏 జగద్గురువులు, సనాతనధర్మ పరిరక్షకులు, పూజనీయులు శ్రీఆదిశంకరుల జయంతి నేడు, వైశాఖ శుద్ధ పంచమి. శుభాకాంక్షలు అందరికీ. " యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం " - భ.గీత 4:7 " ఎప్పుడయినా ధర్మానికి హాని జరుగుతూన్నప్పుడు ధర్మరక్షణకోసం వస్తూంటాను నేను " అన్నారు పరమాత్మ. అంటే ఎల్లప్పుడూ ఎవరినో ఒకరిని సంహరించడానికే అనుకోనక్కరలేదు. అలాగే ప్రతీసారీ ఆయనే రారు. సనాతనధర్మం పరిరక్షణ కోసం ఎవరినో ఒకరిని పంపిస్తూ ఉంటారు పరమాత్మ. ఆదిశంకరులు అలా వచ్చినవారే. కారణజన్ములు. వేదాలు కర్మకాండ, వేదాంగాలు ( ఉపనిషత్తులు మొ.గునవి ) జ్ఞానకాండ. ధనవ్యయంతో కూడుకున్న ద్రవ్యయజ్ఞాలకన్నా జ్ఞానయజ్ఞమే మేలు అన్నారు పరమాత్మ ( భ.గీత 4:33 ). ఆదిశంకరులు " రాబోయేది గడ్డుకాలం, జీవులు సంసారసాగరంలో మునిగిపోయి నానాబాధలూ పడుతూంటారు, దైవచింతనకు సమయం ఎక్కడుంటుంది. అటువంటివార...