శ్రీలలితాదేవీ నవరాత్రులు నేటినుంచి, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏 " చిదగ్నికుండసంభూతా, దేవకార్యసముద్యతా " - అమ్మవారి అద్భుతనామాలు. ఇవి శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 4,5 వ నామాలు. " దేవకార్యార్ధమై అమ్మవారు అగ్నికుండంలోంచి పుట్టారు " అని. ఎప్పుడు, ఎలా అన్నది తెలుసుకుందాం. భండాసురుడు, అతని తమ్ముళ్ళు విశుక్రుడు విషంగుడు అనేవారు దేవతలను, ప్రజలను తమ మాయాబలంతో పీడించుకు తినేవారు. దేవతలు దెబ్బలు తిని తిని నిస్సత్తువతో బాధపడేవారు. వెళ్ళి అందరూ త్రిమూర్తులకు మొరపెట్టుకున్నారు కాపాడమని. భండాసురుడి శక్తులు తెలుసు కనుక అమ్మవారే దిక్కు అని త్రిమూర్తులు తలచి శివుడి ఆధ్వర్యంలో మహాయాగం చేసారు. శివుడు తన మూడవకన్ను ఫాలనేత్రంనుంచి అగ్నిని సృష్టించి హోమగుండంలో వేసారు. యాగం అయాక ఆ అగ్నికుండంలోంచి అమ్మవారు ఉద్భవించారు. అందుకే అమ్మవారిని " చిదగ్నికుండసంభూతా " అని కొలుస్తున్నారు. ఆవిడే శ్రీలలితామహాత్రిపురసుందరీదేవి. అలా వస్తూన్న అమ్మవారు ఎలా ఉన్నారో లలితోపాఖ్యానం ఇలా తెలియచేస్తూంది: పరాశక్తిశ్చ చంద్రాభా చంద్రవచ్ఛీతలాకృతిః అక్షుస్రక్పుస్తకధరా తైర్దేవై: అవలోకితా అమ్మవారు చంద్రుని వంటి కాంతుల్ని వెదజల్లుతూ, చల్లగా ఉం...