అమ్మవారు సగుణ, నిర్గుణ స్వరూపం. అర్ధనారీశ్వరం - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీమాత్రేనమః "🙏
" సనకాది సమారాధ్యా " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 726 వ నామం.
" సనకాది సమారాధ్యా " ఇంకొక అద్భుతనామం. సనకాదులచే సంపూర్ణంగా ఆరాధించబడినది అని అర్ధం. అమ్మవారి నామాల్లో స్మరింపబడుతున్నారంటేనే తెలుస్తూంది వీరి గొప్పదనం. వారు నలుగురు పిల్లలు - సనక, సనందన సనాతన, సనత్కుమారులు. ఇప్పుడు మనం " బాలమేధావులు " అంటూంటాం. ఈపదానికి ఆద్యులు వీరు. 4వ ఏటే అన్నివేదాలు చదువుకున్నవారు. బ్రహ్మ మానసపుత్రులు. సృష్టికోసం వీరిని పుట్టిస్తే వీరు ఆధ్యాత్మికంగా ఉండి బ్రహ్మ మాటను వినలేదు. అప్పుడు బ్రహ్మ మనువులను పుట్టించారు సృష్టికోసం.
ఈ సనకసనందనాదులు జ్ఞానసముపార్జనకై కైలాసానికి వెళ్ళారు ఓ రోజు. అక్కడ శివపార్వతులు నాట్యం చేస్తున్నారు, ప్రమధగణాలు ఆనందంతో తిలకిస్తూ ఊగి పోతున్నారు. ఇలా భార్యతో కూడి నాట్యాలు చేసే ఆయన జ్ఞానాన్ని ఏమి ఇస్తాడు అని తలచి వీరు తిరిగి వెళ్ళిపోతారు.
వీరు అసంతృప్తితో తిరిగి వెడుతూంటే దారిలో పెద్ద మర్రిచెట్టు క్రింద ఓ పిల్లాడు కూర్చుని ఉంటే ఆయన ముందర పెద్దవయస్సు వారైన ఎందరో ఋషులు కూర్చుని ఉంటారు. ఆశ్చర్యంతో వీరు దగ్గరకు వెళ్ళడం, ఆ పిల్లవాడి చిరునవ్వు చూడడంతోనే వీరికి సంపూర్ణ జ్ఞానోదయం అవడం జరిగింది. ఆ పిల్లవాడి కుడిచెవికి మకరకుండలం ఎడమచెవికి తాటంకం ఉండడం గమనించి ఆయనే " గురు " దక్షిణామూర్తిగా గ్రహించి ఆయన్ని సేవించుకుని ధన్యులయ్యారు.
అంతటి మహానుభావులు కనుకే అమ్మవారి నామాల్లో స్థానాన్ని పొందారు.
" శ్రీదక్షిణామూర్తిరూపిణి " ఆశీస్సులు అందరికీ పుష్కలంగా కలగాలని కోరుకుందాం.
ఏతత్ ఫలం సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment