శ్రీలలితాదేవీ నవరాత్రులు నేటినుంచి, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" చిదగ్నికుండసంభూతా, దేవకార్యసముద్యతా " - అమ్మవారి అద్భుతనామాలు. ఇవి శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 4,5 వ నామాలు.

" దేవకార్యార్ధమై అమ్మవారు అగ్నికుండంలోంచి పుట్టారు " అని. ఎప్పుడు, ఎలా అన్నది తెలుసుకుందాం.

భండాసురుడు, అతని తమ్ముళ్ళు విశుక్రుడు విషంగుడు అనేవారు దేవతలను, ప్రజలను తమ మాయాబలంతో పీడించుకు తినేవారు. దేవతలు దెబ్బలు తిని తిని నిస్సత్తువతో బాధపడేవారు. వెళ్ళి అందరూ త్రిమూర్తులకు మొరపెట్టుకున్నారు కాపాడమని.

భండాసురుడి శక్తులు తెలుసు కనుక అమ్మవారే దిక్కు అని త్రిమూర్తులు తలచి శివుడి ఆధ్వర్యంలో మహాయాగం చేసారు. శివుడు తన మూడవకన్ను ఫాలనేత్రంనుంచి అగ్నిని సృష్టించి హోమగుండంలో వేసారు. 

యాగం అయాక ఆ అగ్నికుండంలోంచి అమ్మవారు ఉద్భవించారు. అందుకే అమ్మవారిని " చిదగ్నికుండసంభూతా " అని కొలుస్తున్నారు. ఆవిడే శ్రీలలితామహాత్రిపురసుందరీదేవి. 

అలా వస్తూన్న అమ్మవారు ఎలా ఉన్నారో లలితోపాఖ్యానం ఇలా తెలియచేస్తూంది:

పరాశక్తిశ్చ చంద్రాభా 

చంద్రవచ్ఛీతలాకృతిః

అక్షుస్రక్పుస్తకధరా 

తైర్దేవై: అవలోకితా

అమ్మవారు చంద్రుని వంటి కాంతుల్ని వెదజల్లుతూ, చల్లగా ఉంది. ఆ తల్లి నాలుగు చేతులతో భాసిస్తూ ఒక చేతిలో అక్షమాల, మరొక చేతిలో పుస్తకం, మరో రెండు చేతులతో వరదముద్ర, అభయముద్ర ధరించి మహా శంభువు ప్రక్కనే ఉంది. అమ్మవారు పరచితి. ఆయన పేరు పరశంభు. ఆ ఇద్దరి స్వరూపం గోచరించింది. ఏదైతే ఇంతవరకూ నిరాకారంగా వ్యాపించి ఉందో అదే సాకారమైంది.

బ్రహ్మ ఆజ్ఞతో విశ్వకర్మ అమ్మవారికోసం ఒక మహానగరాన్ని సృష్టించారు. దానిపేరు శ్రీమన్నగరం. 

అమ్మవారు ముందర మంత్రిణీదేవిగా శ్యామలాదేవిని, దండనాధాదేవిగా వారాహీదేవిని ఏర్పాటుచేసారు. అమ్మవారి  చిరునవ్వులోంచి 64 కోట్ల సేనలు పుట్టుకొచ్చాయి. 

అమ్మవారి హృదయంలోంచి " బాలాత్రిపురసుందరీదేవి " ఉద్భవించింది. ఈవిడను ముద్దుగా " బాల " అని పిలుచుకుని సేవించుకుంటారు.

ఈరోజు నుంచి శ్రీలలితాదేవీ నవరాత్రులు ప్రారంభం. అమ్మవారిని ధ్యానించుకుని ఆశీస్సులు అందుకుందాం. 

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ