" వృక్ష ఏవ హతో హంతి "
" ధర్మ ఏవ హతో హంతి, ధర్మో రక్షతి రక్షితః " - మనుస్మృతి - ధర్మం నాశనం చేస్తే నాశనం చేస్తుంది, రక్షిస్తే రక్షిస్తుంది. ఇలాగే " వృక్షో రక్షతి రక్షితః " అంటారు - మరి పచ్చగా కళకళ లాడుతూన్న మొక్కని కొట్టేస్తే ఏమవుతుంది. మన వాళ్ళు చెబుతూంటారు " పచ్చని చెట్టుని " కొట్టకూడదని. మేము మద్రాస్ లో ఉండగా ఓ 3 పోర్షన్ల ఇంట్లో అశోక్ నగర్ లో ఉండేవాళ్ళం- ముందర పోర్షన్ లో మేము, వెనకాల పోర్షన్ లో ఓనర్స్ , పైన ఇంకో పెద్ద ఫేమిలీ. ఇంటి ఓనర్స్ ది మన బందరు. ఆయన మద్రాస్ కార్పొరేషన్ లో ఇంజనీర్( 45 ఏళ్ళు ఉంటాయి ), ఆవిడ డాక్టర్- వాళ్ళ పోర్షన్ వెనకాల వాళ్ళ నర్శింగ్ హోం ఉంది. వాళ్ళ రాకపోకలు హాస్పిటల్లోంచే, మా వైపు ఎప్పుడో కాని వచ్చేవారు కాదు. పూజ కోసం వత్తులు, వస్త్రం , యజ్ఞోపవీతాల కోసం మంచి పత్తి దొరికేది కాదు మాకు , అందుకని మా గ్రామం వెళ్ళినప్పుడల్లా అక్కడ నుంచి తెచ్చుకునేవాళ్ళం- ఏడాదికి 2,3 సార్లు ఎలాగూ వెడుతూండడంతో. అక్కడ పెరటిల్లోనే మంచి పత్తి నిచ్చే మొక్కలు ఉండేవి. మరి ఎప్పుడైనా తుడిచేటప్పుడు పడిందేమో మరి ఇంటి ముందరున్న కొబ్బరి చెట్టు మొదట్లో ఓ ప్రత్తి మొక్క వచ్చింది - దానికి రోజూ ఓ చెంబుడు నీళ్ళు పోసేటప్పటికి అది పెద్ద మొక్క అయి ఓ 100 పిందెలు పెట్టేసింది- మాకు ఎంతో ఆశ్చర్యం గాను వింతగాను అనిపించింది. ఓ రోజు ఓనర్ ఈ వైపు వచ్చి మొక్కను చూసి "అయ్యో ఇంత పెద్ద మొక్క ఎలా వచ్చింది, పురుగులూ అవీ వస్తాయి కొట్టించేయాలి " అన్నారుట మా వాళ్ళతో. మేము అప్పటికే ఇంకో ఇంటికి మారడానికి ఏర్పాట్లు అయిపోయాయి , ఇంకో నెలలో వాళ్ళ ఇల్లు ఖాళీ చెయ్యబోతున్నాం. మా వాళ్ళు " మొక్క పచ్చగా పిందెలతో ఉంది , కొట్టించకండి , ఇంకో ఒకటి రెండు నెలల్లో కాయలు పండి పగిలిపోతాయి , పత్తి వాడుకోండి , మొక్క వద్దనుకుంటే ఇంకో కాపు మొదలయ్యేలోపు అప్పుడు కొట్టించెయ్యండి కాని ఇప్పుడు వద్దు " అన్నారుట. ఆయన మేము వెళ్ళిపోయే 4 రోజుల ముందర ఎవర్నో తీసుకువచ్చి మొక్క ని పూర్తిగా కొట్టించేసారు- చాలా బాధగాను దిగులుగాను ఉండేది ఆ 4 రోజులూ. 2 నెలల తరువాత నేను ఆఫీస్ కొచ్చేక మా టెంపరరీ సబ్ స్టాఫ్ " సార్ మీరు మొన్న ఖాళీ చేసిన ఇంటి ముందర చాలా జనాలు గుముగూడి ఉన్నారు , ఏమైందో మరి " అన్నాడు. ఇంటి పైన ఓం శక్తి మందిరం పెట్టారు వాళ్ళు - ఆ జనాలేమో " అన్నాను. అక్కడున్న వాళ్ళ మొహాలు చూస్తే అలా లేదు అన్నాడు అతను. మరునాడు ఆఫీస్ కి ఆ ఇంటి మీదుగా వస్తే తెలిసింది - ఇంటాయన(ఓనర్) కరెంట్ షాక్ తో పోయారని - ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే రాత్రి స్టెప్స్ దగ్గర వెలుగు కోసం ఇంట్లోంచి వైరు లాగి బల్బు పెట్టారుట- పొద్దున్న స్విచ్ తీసిన ఆయన ప్లగ్ తీయకుండా అటునుంచి వైరు చేతికి చుట్టుకుంటూ వస్తూంటే వాళ్ళ అమ్మాయి ఓ స్విచ్ కి బదులుగా ఈ స్విచ్ ఆన్ చెయ్యడం ఈయనకి వైరు లో లోపంతో షాక్ కొట్టి పోవడం జరిగిందిట. మొక్కని కొట్టించడం వల్లేనా అంటే చెప్పలేం కాని దాని వల్ల కూడా అయిఉండవచ్చని బాధనిపించింది - వృక్ష ఏవ హతో హంతి " - సర్వే జనాః సుఖినో భవంతు
Comments
Post a Comment