గతజన్మవాసనలు
" జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి " అన్నాడు రాముడు యుద్ధం తరువాత - అంటే తల్లి, జన్మభూమి స్వర్గానికన్నా ఎక్కువని - జర్మనీలు కలిసిపోతేనే ఆనందం గా ఉందే, మన రాష్ట్రం విడిపోతేనే బాధగా అనిపిస్తూందే మరి వాళ్ళ పుట్టిన ఊరుని దేశాన్ని కూడా వదిలేసి బంగ్లాదేశ్ వాళ్ళూ మయన్మార్( బర్మా) వాళ్ళూ భారత్ కి ఎందుకు వచ్చేస్తున్నారో. అంటే ఇక్కడి బియ్యపు గింజలమీద వాళ్ళ పేర్లు వ్రాసి ఉన్నాయనుకోవాలా. ఎవరికి సంతానం గా వెళ్ళాలో కూడా ముందరే నిర్ణయించుకుంటాయి ఆత్మలు అంటారు పెద్దలు - జరిగే సంఘటనలు చూస్తూంటే నిజమేననిపిస్తుంది. మేము అమెరికా వెళ్ళినప్పుడు మొదటి 3 వారాలు మంచుతో సరిపోయింది- తరువాత ఓ రోజు మా అబ్బాయి రమ్మంటే ఓ మాల్ కి షాపింగ్ కి వెళ్ళాం. కార్ పార్కింగ్ లో పెట్టి దిగాం, ప్రక్క కారులోంచి ఒక నడివయసు యువతి , ఒక 9,10 ఏళ్ళ అమ్మాయి దిగేరు. ఆవిడ స్లీవ్ లెస్ స్కర్ట్ వేసుకుంది, ఈ అమ్మాయి ఫుల్ ఫేంట్ ఫుల్ హేండ్స్ షర్ట్ వేసుకుంది- ఇది ఎందుకు గమనించవలసి వచ్చిందంటే మేము కార్ దిగి అటుచూస్తే వాళ్ళు మా వంకే చూస్తున్నారనిపించింది నాకు. మా వాడు బయలుదేరేటప్పుడే చిన్న క్లాస్ పీకేడు - చిన్న పిల్లలు కనిపిస్తే హాయ్, చీ చీ అంటూ పలకరించడం , బుగ్గలు నిమరడం ( మన దేశం లో అలా చెయ్యకపోతే సోషల్ సెన్స్ లేదనుకుంటారు కొందరు - అందువల్ల అయి ఉండవచ్చు ) , ఎవరైనా చూసి నవ్వితే నవ్వాలి, హాయ్ అంటే హాయ్ అనాలి, ఆడవాళ్ళు ఎదురుపడితే వాళ్ళకి దారి ఇచ్చి తరువాత మనం వెళ్ళాలి, ఎదర నడిచే మనిషికి అడుగు దూరం లో ఉండాలి కాని మన దేశం లో లా పొట్ట తగిలించి మోచేతితో పొడుస్తూ నడవకూడదు లాంటివి. అది జ్ఞాపకానికి వచ్చి ఎదరికి నడిచాం. మొదటి సారి బయటకు రావడం తో నేను ఓ కొత్త డ్రెస్ మా ఆవిడ పట్టుచీర ధరించాం. మేం లోపలికి వెళ్ళి ట్రాలీ తీసుకుని ఓ సెక్షన్ లోకి వెడుతూంటే ఇందాకా ఇద్దరు ఓ ప్రక్కన నుంచుని మమ్మల్నే చిరునవ్వు తో చూస్తున్నారు. ఇంకో సెక్షన్ లో కూడా అలాగే జరిగింది. చివర్లో షాపింగ్ అయి బిల్ కౌంటర్ దగ్గరికి వెడుతూంటే ఓ ప్రక్కగా వాళ్ళు నుంచునున్నారు. నేను మావాడితో ఆ ప్రక్కనున్న ఇద్దరూ గంట నుంచీ మన వెనకాలే వస్తున్నారు, మన వేపు చూస్తున్నారు- నీకు తెలిసిన వాళ్ళా లేక ఏదైనా ఎంక్వైరీ కోసమో చూడు అన్నాను. వాడు అటు చూస్తే వాళ్ళు చిరునవ్వు నవ్వేరు- మా వాడు 2 అడుగులు ముందుకేసి " ఎస్ ప్లీజ్ " అన్నాడు - అంతే ఆ అమ్మాయి గబ గబా మా ఆవిడ ముందుకు వచ్చి " యువర్ డ్రెస్ వెరీ నైస్ , ఐ లైక్ ఇట్ " అంది నవ్వుతూ - వెంటనే మా ఆవిడ " యువర్ డ్రెస్ ఆల్సో వెరీ నైస్, ఐ లైక్ ఇట్ " అంది- ఆ అమ్మాయి " థేంక్యూ "
అని కిలా కిలా నవ్వుకుంటూ వెళ్ళి పోయింది తన తల్లి దగ్గరకి. నాకు మతి పోయింది - దీని కోసమా గంట నుంచి వెనక్కాల పడింది అని. కారులో మా ఆవిడ తో " వింతగా లేదూ ఇది " అంటే మా ఆవిడ అంది " ఇందులో వింత ఏముంది , ఆ పిల్ల డ్రెస్ చూసావా ఎంత నిండుగా ఉందో అంటే ఆ అమ్మాయి పెద్దయ్యాక మన దేశం లో సెటిల్ అవుతుంది లేదా క్రిందటి జన్మలో మన దేశం అమ్మాయి అయి ఉంటుంది, ఆ వాసనలు పోవు " అంది. అమ్మో ఈ విషయం వెనక ఇంత సీన్ ఉందా అనిపించింది . లోకాస్సమస్తాస్సుఖినో భవంతు - శుభం భూయాత్
Comments
Post a Comment