Sri gurubhyonnamaha

మొన్న ఓ రోజు గరికిపాటి వారు ప్రవచనం చేస్తూ " ఇప్పుడు ప్రతీ పనికీ ముహూర్తాలు సలహాలు సంప్రదింపులూనూ , ఇదివరకు ఇలా ఉండేది కాదు - అమ్మా  నాన్నా ఏది చెప్పేవారో అది చేసే వాళ్ళం - ఇది మంచిదిరా అనేవారు చేసేవాళ్ళం అది తప్పు అలా చేయకు అనేవారు మానేసే వాళ్ళం " అన్నారు. పూర్వపు రోజుల్లో గురువులు కూడా అలా తమవంతు సలహాలిచ్చేవారు. నేను  కాలేజీ లో చదివే రోజుల్లో ఓ బిల్డింగులో ఎదర రూం లో అద్దెకుండేవాళ్ళం , ప్రక్కన ఒక పోర్షన్ దాని ప్రక్కన ఇంకో పోర్షన్ ఉండేవి. ఆ రెండో పోర్షన్ కి ప్రక్కన నుయ్యి ఉండేది నీళ్ళకి. కొన్నాళ్ళకి ఆ రెండో పోర్షన్ ఖాళీ అవడం దానిలోకి మా సంస్కృతం లెక్చరర్ అద్దెకి రావడం జరిగింది - ఆయన పొద్దున్నే 6 గం కి పొట్టి ఖాకీ లాగు వేసుకుని సైకిల్ మీద ఆర్ ఎస్ ఎస్ కార్యక్రమాలకి వెళ్ళేవారు. నేను అప్పటికే అరుగు మీద ఉండేవాడిని ఎవరో ఒకరు రావడం తో - దీనికి ఓ కారణం ఉంది , మా మేథ్స్ లెక్చరర్ పి వి ఎస్ గారని ఉండేవారు, ఆయన రీసెర్చ్ పనిలో బిజీగా ఉండడం తో ఓ సారి నన్ను పిలిపించుకుని " మొన్న ఆ శర్మ వచ్చేడోయ్ , 30 లెక్కలకి 28 రాలేదంటాడేమిటి 3,4 అయితే నేను చెప్పేవాడిని నిన్ను కలవమని చెప్పాను అవేవో కొంచెం చూద్దూ " అని. ఇదే విషయం ఆయన క్లాస్ లో కూడా చెప్పడం తో ఎవరో ఒకరు వస్తూండేవారు పొద్దున్న 6 - 7 మధ్య. మాకు కాలేజీ 7.30 నుంచి 12.30 దాకా ఉండేది. ఓ రోజు వంటి గంటకు స్నానం చేస్తున్నాను బావి దగ్గిర. లెక్చరర్ గారు చూసి " ఏమిటి విషయం ఇప్పుడు  చేస్తున్నావు " అన్నారు. రోజూ పొద్దున్న  స్నానం చేసేవాళ్ళం కాదు ఎవరూ , బాగా చలిగా ఉండేది (ఇప్పట్లా కాదు) - ఆ విషయం  చెబితే ఆయన " అది తప్పు ఉదయమే స్నానం చెయ్యాలి అదే మన  సంప్రదాయం , బావి ప్రక్కనే పొయ్యి మీద వేడి నీళ్ళ బింది ఉంటుంది 5.30 అయేసరికి , ప్రక్కనే బకెట్ ఉంటుంది , నువ్వు రేపటినుంచి ఆ వేడి నీళ్ళు తీసుకుని  స్నానం చెయ్యి , మా ఆవిడతో కూడా చెబుతాను " అన్నారు    - నాకు ఏమి చెప్పాలో తెలియలేదు కాని మళ్ళీ ఎప్పుడూ ఉదయమే స్నానం చెయ్యకుండా కాలేజీ కి వెళ్ళలేదు - శుభం భూయాత్  

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ