స్నేహమేరా 1

నా బాల్య మిత్రుడు ఖాదర్ బాబా తో మొదటి పరిచయం జ్ఞాపకం లేదుకాని 6 తరగతి తరువాత సన్నిహితం ఎక్కువయ్యింది. తను కూడా ఖొ ఖొ , బాల్ బాడ్మింటన్ ఆడేవాడు. సెక్రటరీ ( పోష్ట్ లో వ్రాసాను) గారి అబ్బాయి - దువ్వూరి అనే పిలిచేవాళ్ళంఖాదర్ , నేను కలిసి తిరిగేవాళ్ళం. సాయంత్రం దువ్వూరి వెళ్ళిపోయేవాడు కాని ఖాదర్ వెళ్ళి భోంచేసి వచ్చేసేవాడు చదువుకోవడానికి  - అప్పటికే పప్పు శర్మ , బుచ్చి శర్మ అనేవాళ్ళు ఇద్దరు ఊళ్ళో వారాలు చేసుకుంటూ ( మా నాన్నగారు అలా ఏర్పాటు చేసేవారు- కష్టం విలువ తెలియాలనేమో మరి ) మా ఇంట్లో ఉండి  చదువుకునేవారు. ముగ్గురూ అరుగు మీద చాప , దిండు తో కాలక్షేపం చేసేవారు - ఆదివారం రాత్రి ఫలహారం మినపరొట్టి - ఖాదర్ కూడా మా ఇంట్లోనే రొట్టి తినేవాడు, తెగ ఆనందపడేవాడు - పరీక్ష రోజుల్లో ఖాదర్ ని తెల్లారకట్ట 4 గం కి లేపి కాఫీ ఇచ్చేవారు మా అమ్మగారు - మా ఊరికి దక్షిణం లో చెరువు ఉంది, దానిని చాకలి చెరువు అని పిలుస్తారు. దాని ఒడ్డున ఈత చెట్లు ఉండేవి , పళ్ళు రాలడానికి రాళ్ళతో కొట్టేవాళ్ళం. రోడ్లు  వెయ్యడానికి ఎర్ర కంకర రాళ్ళ గుట్టలుండేవి. రోజు పెద్ద రాయితో నేను కొడితే గెలకి , చెట్టు కాండం కి తగిలి వెనక్కి వచ్చి నా తలపై పడింది - తల పగిలి రక్తం మొహం మీదుగా   కారి చొక్కా అంతా తడిసిపోయింది  , వెంటనే ఖాదర్ డాక్టర్ దగ్గరకి మోసుకుపోయాడు. చాలాకాలం పట్టింది రికవరీకి. గ్రామానికి 4 కి మీ దూరం లో ఉండేవారు ఆయుర్వేదం డాక్టర్ గారు - వారం వారం ఖాదర్ వెళ్ళి మందులు తెచ్చేవాడు - వాళ్ళకి చిన్న హొటల్ , చిన్న కిళ్ళీ షాప్ ఉండేవి. తొందరగా తగ్గుతుందని వాళ్ళ అమ్మగారు కోడి గుడ్డు ఉడికించి ఇచ్చి తినమనేవారు. వాళ్ళ అమ్మగారు రంజాన్ రోజుల్లో సేమ్యా ఇచ్చేవారు మా ఇంట్లో రోజుల్లో సగ్గుబియ్యం వాడేవారు, సేమ్యా గ్రామం లో ఎవరికీ తెలియదు- ఎలా చేసుకోవాలో , ఏమేమి చేసుకోవచ్చో చెప్పేవారు. ఖాదర్ నాన్నగారు ఇబ్రహీం గారు - గ్రామ వ్యాపారస్తుల సంఘానికి ప్రెసిడెంట్ - శ్రీరామ నవమి ఉత్సవాలు ఆయన ఆధ్వర్యం లో అద్భుతం గా 5 రోజులు జరిగేవి. రోజు తోలుబొమ్మలాట తప్పనిసరి. ఖాదర్ బాగానే చదివేవాడు. లెక్కలు సైన్స్ వీక్- తరచు చెప్పేవాడిని. 8 నుంచీ ఖాదర్ నాన్నగారు " సూర్యం గారు - మా వాడిని ఎస్ ఎస్ ఎల్ సి పాస్ చేయించండి చాలు ఎవర్నైనా పట్టుకుని ఉద్యోగం లో పెట్టేస్తాను " అని తరచు అంటూండేవారు. ఆయన " సూర్యం గారు " అంటే అదోలా ఉండేది - మా అమ్మగారితో చెప్తే ఆయన్ని పిలిచి మళ్ళా అలా  " గారూ " అనవద్దని చెప్పింది - ఆయన అన్నారు " ప్రయత్నించేనండి కుదరటం లేదు "
అని. ఊరికి తూర్పులో శివాలయం వెనకాల ఇంకో చెరువు ఉంది , దాన్ని దేవుడి చెరువు అనేవారు - దాని ఒడ్డున రెండు బొగడ చెట్లు ఉండేవి - 10 తరగతి వేశవి సెలవుల్లో చెట్టు ఎక్కి బొగడ పళ్ళు కోస్తూంటే ఎవరో కొంచెం ముందర 4 పళ్ళు ఉన్నాయనడం నేను కాలు ఎదరికి జరపడం జ్ఞాపకం ఉంది , తరువాత గంట తరువాత మెలుకువ వచ్చింది, చెట్టు మీంచి జారి క్రింద  పడడం స్పృహ కోల్పోవడం జరిగింది - ఎడమ చేయి మణికట్టు పైన ఎముక విరిగింది - అప్పటినుంచి ఖాదర్ ఇంకా దగ్గిరయ్యాడు - పోష్ట్ పెద్దదయింది  - ఆపేద్దాం ఇప్పటికి - శుభం భూయాత్ 
( స్నేహమేరా 2 చదవండి )

  

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ