స్నేహమేరా 2

రంజాన్ శుభాకాంక్షలు మిత్రులందరికీ
--------------------
మేము ( ఖాదర్, నేను)
 ఎస్ ఎస్ ఎల్ సి లోకి వచ్చేక ఆటలు , సినీమాలు , కబుర్లూ తగ్గాయి- అంతకు ముందు వాళ్ళ  ఉరుసు ఉత్సవాలకి  వెళ్ళేవాళ్ళం , ఇప్పుడు అదీ లేదు - చేతి కట్టు విప్పేదాకా సేవ అంతా ఖాదర్ దే. డైలీ రాత్రిళ్ళు లెక్కలు,  సైన్స్ చెప్పేవాడిని. తెల్లవారకట్ట మిగతా సబ్జెక్ట్స్ చదివేవాడు - మంత్లీ టెస్ట్స్, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ పరీక్షలలో కూడా మంచి మార్కులు వచ్చేయి వాడికి. సంక్రాంతి సెలవులవగానే మా సైన్స్ మేస్టారు పిలిచారు - నాటకం సెలెక్షన్ అయింది - 4,5 రోజుల్లో రిహార్సల్స్ మొదలెడదామని. 2 నెలలు చదువుండదు- నాకు సరే  ఖాదర్ ఎలా - రాత్రుళ్ళు మాట్లాడడమే కుదరదే - ఇదిగో ఈ కారణం వల్లే (బి డి ఓ గారి అమ్మాయి  చెప్పిందని మాత్రమే కాదు ) " ఇంక నాటకం లో పాల్గొనను " అని చెప్పాను మేస్టారితో . కుదరదన్నారు. " నువ్వు కూడా ఉండడం వల్లే పెద్ద నాటకం వేస్తున్నాం " అన్నారు. డిసైడ్ అయిపోయి మరునాడు వెళ్ళి " ఇంక వెయ్యను సార్ " అంటే లాగి లెంపకాయ కొట్టారు. మళ్ళీ అడిగినా మనసు మార్చుకో లేదు. దువ్వూరి కి 260 మార్కులు  వచ్చి పాస్ అయితే ఖాదర్ కి 340 - హై సెకండ్ క్లాస్ మార్కులు - వచ్చినా  ఇంగ్లీష్ లో ఒక్క మార్క్ తక్కువ వచ్చి పరీక్ష పోయింది. ఖో ఖో బాగా ఆడేవాడు అని మళ్ళీ స్కూల్లో చేరమన్నారు ఖాదర్ ని హెడ్ మాస్టర్. తరువాత కిళ్ళీ కొట్లో సెటిల్ అయేడు -
ఏ పనిలో అయినా ఖాదర్ సిన్సియర్ గా , స్పెషల్ గా ఉండేవాడు.  ఖాదర్ సోడా ,కిళ్ళీ స్పెషల్ గా ఉండేది - వాటి కోసం ప్రక్క గ్రామాలనుంచి , పట్టణాల వాళ్ళు స్కూటర్, సైకిల్స్ మీద  మా ఊరి మీదుగా వెళ్ళేవాళ్ళు కూడా ఆగి తాగి వెళ్ళేవాళ్ళు. సోడా బుడ్లు పేలుతూండేవి- గాస్ తక్కువ పట్టు అని తిడితే " అలా అయితే ఖాదర్ సోడా అనరు కదండీ " అనేవాడు. మా ఇంట్లో కాని , నాకు కాని ఏ అవసరమొచ్చినా ఖాదరే. ముఖ్యంగా నా స్కాలర్షిప్ లకి తహసిల్దార్ సంతకాలు వాడే చేయించుకొచ్చేవాడు- ఎం ఎస్ సి లో కూడా. పోష్ట్ లో పంపిస్తే సంతకం చేయించి తిరుగు టపా లో పంపించేవాడు - ఎవరి కాళ్ళు పట్టుకునే వాడో మరి - ఎప్పుడూ లేట్ చెయ్యలేదు. నేను బి ఎస్ సి మొదటి ఏడు చదువుతూండగా మా నాన్న గారు పోయారు - అప్పుడు అమలాపురం లో ఉండేవాడిని - పొద్దున్న 5.30 కి వచ్చి లేపాడు. " అమ్మగారు వెంటనే తీసుకురమ్మన్నారని " చెప్పి  సైకిల్ మీద కూర్చోపెట్టుకుని తీసుకెళ్ళాడు.  నేను మద్రాస్ లో  పనిచేస్తూన్నప్పుడు మా అమ్మగారికి వంట్లో బాగుండకపోతే వచ్చి 4 రోజులు ఉండి వెళ్ళాను- నేను వెళ్ళిన మరునాడే ఆవిడ పరమపదించేరు. ఫోన్లు కలిసేవి కావు అప్పుడు, టెలిగ్రాం ఆ మరునాడు  రావడం నేను 3 వ రోజుకి రావడం జరిగింది. దహన ఏర్పాట్లన్నీ ఖాదరే  చూసుకున్నాడని అందరూ చెప్పారు- మా అమ్మ ఋణం అలా తీర్చుకుని మమ్మల్ని వాడికి ఋణగ్రస్తులుగా చేసుకున్నాడు. ఎప్పుడైనా అవసరమైతే మాట సహాయం నగదు సహాయం తప్ప పెద్దగా నేను చేసిందేమీ లేదు ఖాదర్ కి వాళ్ళ ఫేమిలీకి , మరి వారి కుటుంబ సభ్యులందరికీ ఎంత అభిమానమో మేమంటే. జన్మ జన్మల సంబంధం కూడా అయి ఉండచ్చు. 2001 లో ఫేమిలీ అందరం ఊరికి వెళ్ళాం - చాలా కాలం అయిందని సినీమా కి వెళ్ళాం అమలాపురం కి - మా అబ్బాయి " నువ్వు నాకు నచ్చావు " కి వెడదాం బావుంటుందన్నాడు - చాలా సంవత్సరాల తరువాత ఖాదర్ కి కూడా ఇదే సినీమా చూడడం, హేపీ గా ఫీల్ అయేడు. ఖాదర్ కేన్సర్ తో 2012 లో చనిపోయాడు. ఈ పవిత్ర రంజాన్ సమయం లో అతని ఆత్మకు శాంతి ని ప్రసాదించమని ఆ పరదేవతని  కోరుకుంటూ - అతని  ప్రియ బాల్య మిత్రుడు సూర్య

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ