భగీత 10.25
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏
" యజ్ఞానాం జపయజ్ఞోస్మి " - ( భ.గీత 10:25 ) అన్నారు పరమాత్మ భ.గీతలో.
ఏదయినా మంత్రాన్ని జపం చేసుకోవచ్చు. కాని ముక్తినిచ్చే తారక మంత్రం ఒకటే. అది రామనామం.రామనామం ఎందుకు అంత పవిత్రమయినది/ఉత్కృష్టమయినది/శక్తివంతమయినది అయింది.
రామ లో " ర+అ+మ " - 3 అక్షరాలు ఉన్నాయి. ర అగ్నిబీజం, అ సూర్యబీజం, మ చంద్రబీజం.
మనసా(మ) వాచా(ర) కర్మణా(అ) అంటారు - రామ నామంలో ఈ మూడూ ఉన్నాయి.
విష్ణుసహస్రంలో " రామః విరామః " అని నామాలు చదువుతాం. ఆదిశంకరులు రామః కి " నిత్యానంద చైతన్యములో సదా రమించువాడు " అని భాష్యం చెప్పారు.
వేదం ఇలా చెబుతూంది:
" రకారో అగ్నిబీజంశ్చాత్, అకారో సూర్యబీజకం, మకారాశ్చంద్రబీజంచ " అని.
కుండలినీయోగాలో కూడా చక్రాలను 3 మండలాలుగా విభజించారు. మూలాధారం నుంచి అనాహతచక్రం వరకూ అగ్నిమండలం అని, అక్కడనుంచి ఆజ్ఞాచక్రం వరకూ సూర్యమండలం అని, ఆపైనదానిని చంద్రమండలం అనీ తెలియచేసారు. రామ అని జపిస్తే ఈ 3 మండలాలూ జాగృతి/చైతన్యం చెందుతాయి. అందుకే రామనామం అంత శక్తివంతమయింది.
వాక్కుని శరీరాన్ని మనస్సుని చైతన్యపరిచేది రామ నామం.
" రమంతే సర్వేజనాః గుణైతి ఇతి రామః " అంటే " సర్వజనులను ఆనందింపచేసే గుణాలున్నవాడు రాముడు " అని తెలియచేస్తున్నాయి పురాణాలు.
గరుత్మంతుడు శ్రీరాముడిని " రిపుణామతి వత్సలా " అంటే " శత్రువులమీద కూడా వాత్సల్యం చూపేవాడు " అని కొనియాడాడు.
అమ్మవారు పార్వతీదేవి శివుడుని అడుగుతుంది " నిత్యం విష్ణుసహస్రం పారాయణచేసే పండితులు ఎప్పుడయినా ఏకారణంచేతనయినా చదువలేకపోతే ఏమి చెయ్యాలి " అని. రామనామాన్ని 3 సార్లు జపిస్తే విష్ణుసహస్రపారాయణ ఫలితం లభిస్తుందని శివుడు తెలియచేసారు. రామనామం అంత పవిత్రమయినది.
" ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం " - ఆపదలను పోగొడుతాడు, సంపదలన్నీ ఇస్తాడు. ఇంకేమి కావాలి సుఖమయజీవితానికి. శ్రీరామరక్ష, సర్వజగద్రక్ష.
ఈరోజు పరమపవిత్రమయిన శ్రీరామనవమి. రామజపం చేసుకుని తరిద్దాం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
ఏతత్ సర్వం శ్రీశ్రీరామార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment