భ గీత 12.1

 🙏 "శ్రీరస్తు శుభమస్తు" 🙏

" ఏవం సతతయుక్తా యే భక్తాస్త్వాం  

                      పర్యుపాసతే, 

  యే చాప్యక్షర మవ్యక్తం తేషాం కే 

                     యోగవిత్తమాః "

                        - భ.గీత 12:1

విగ్రహారాధన మంచిదా, అవసరమా అని చాలామందికి సందేహం కలుగుతూ ఉంటుంది. ఇది ఇప్పటి సమస్యకాదు. పరమాత్మ గీతను బోధించినప్పుడే అర్జునుడికి ఈ సందేహం వచ్చింది. 

" నీ విశ్వరూపాన్ని ( దివ్యమంగళవిగ్రహాన్ని ) పూజించేవారు కొందరు, అవ్యక్తము నాశనరహితము అయిన పరబ్రహ్మరూపాన్ని కొలిచేవారు కొందరు వీరిలో ఎవరు శ్రేష్ఠులు " అని అడిగాడు అర్జునుడు.

ఒకరిమీద అభిమానం కలగాలంటే అతని విభూతులు ( శక్తులు ), రూపం తెలియాలి. అప్పుడు పని సులభమవుతుంది. అందుకే పరమాత్మ తన విభూతులు తెలియచేసి తన విశ్వరూపాన్ని చూపించి తరువాతే భక్తి గురించి తెలియచేసారు. నన్ను నమ్ముకో, అన్నీ నేను చూసుకుంటానన్నారు.

విగ్రహము " అంటే విశేషంగా గ్రహించేది అని అర్ధం. కట్టిపడేస్తుంది జీవులని. అందుకని అప్పుడప్పుడు గుడులను దర్శిస్తూ ఉండాలి. విగ్రహారాధన గురించిన ఓ విషయం చూద్దాం. 

వివేకానందుడు " సర్వమతసభల " కోసం చికాగో వెడదామనుకున్నారు, ధనంలేదు. ఎవరో ఇచ్చిన సలహాతో మైసూర్ మహారాజుని కలిసారు. ఆయన " నా సందేహం ఒకటి తీరిస్తే నీ ఖర్చులన్నీ నేను పెట్టుకుంటాను " అన్నారు. రాజుకి విగ్రారాధనపై నమ్మకంలేదు, ఆ ఆలోచన సరైనదేనా కాదా అని.

ఆ దర్బార్ లో గోడపై రాజుగారి నిలువెత్తు చిత్రపటం ఉంది. సైనికుడిని పిలిచి ఆ పటాన్ని తీసి బయటపడేయమన్నాడు. రాజు కళ్ళు ఎర్రబడ్డాయి, సభికులు బిత్తరపోయారు, సైనికుడు వణికిపోతున్నాడు. అప్పుడు వివేకానందులు అన్నారు " రాజా మీరు ఎదురుకుండానే ఉన్నా ఇది కేవలం ఓ చిత్రం అయినా వీరందరూ దీనిలో తమ రాజుగారిని చూస్తున్నారు. అదే మేము చేసేది. మేము విగ్రహాన్ని ఆరాధించం, విగ్రహంలోని పరమాత్మను ఆరాధిస్తాం " అని. రాజు ఖర్చులన్నీ తనే భరించాడు.

వేదాల్లో " తస్య ప్రతిమ నాస్తి " అని ఉంది. ఇక్కడ ప్రతిమ అంటే విగ్రహం అని అనుకుని కొందరు అతనికి ( దేవుడికి ) విగ్రహం లేదు అని వేదాలే చెపుతున్నాయి కదా మరి విగ్రహారాధన ఏమిటీ అంటున్నారు. కాని ప్రతిమ అంటే " ఉపమానం/పోలిక " అని అర్ధం. అంటే దేవుడికి సమానమైనది లేదు అని అర్ధం అని శ్రీశంకరజయంతి రోజున శ్రీశృంగేరీ ఉత్తరపీఠాధిపతి శ్రీశ్రీ విధుశేఖరభారతీ మహాస్వామి వారు అనుగ్రహభాషణం చేసారు.

మరి విగ్రహాలన్నీ అంటే మన గ్రామంలోది, శ్రీశైలంలోది, కాశీలోది ఒకటేనా. అన్నీ ఒకేలా ఉండే లింగాలేగా. ఒకటికాదు.

ఒకాయన ముంబయి శాఖలో మేనేజర్. అన్ని ట్రైనింగులు అవీ అయాయి. 25కోట్ల ప్రపోజల్ వస్తే " జో ఆ " కో, సెంట్రల్ ఆఫీస్ కో పంపిస్తారు. ఎందుకు ఎవరు చూసినా అవే రేషియోలు ఇతర విషయాలేగా. 

సరే ఏవో రూల్స్ ఉంటాయి. రేపు ఈయనే జోమే కుర్చీలోనో పైన జిఎం కుర్చీలోనో కూర్చుంటే ఈ ప్రపోజల్ ఆయన దగ్గరకే కదా వెళ్ళేది. అదే మెదడు 2 కళ్ళు 2 చేతులు, కొత్తగా ఏమయినా శక్తులు వచ్చాయా ఈయనకి అంటే వచ్చాయి - ఆయన క్రమశిక్షణ, సాధనలతో కూడిన అనుభవం.

అలాగే స్థలప్రభావం, మహర్షులచే ప్రాణప్రతిష్ఠ, వందల సం.లుగా ప్రత్యేకపూజలు ఆ విగ్రహానికి అంటే అందులోని దేవుడికి మహత్తరమయిన శక్తిని కలుగచేస్తాయి. సంశయం నాస్తి. కాశీ శ్రీశైలం తిరుమల మొ.గు క్షేత్రాల్లోని మూర్తుల మహత్తులు ఎవరివి వారివే. సదా దర్శయనీయమే. 

ఆదిశంకరులు మధురమీనాక్షి, శ్రీశైలం భ్రమరాంబ ల ఉగ్రరూపాన్ని యంత్రప్రతిష్టతో తగ్గించారంటే సామాన్యులను దర్శించుకుని తరించమని, ఆయనకు పనిలేక కాదు కదా.

విదేశంలో ఉన్న కుమారుడు/కుమార్తె ఫోన్ చేస్తే కలిగే సంతోషం వేరు, వీడియోకాల్ చేస్తే కలిగే సంతోషం వేరు. అవ్యక్తం, వ్యక్తం లో అంత తేడా మనలాంటి సామాన్యులకు, జ్ఞానులకు కాదు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య. 

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ