భ.గీత 16.21
🙏 " శ్రీరస్తు శుభమస్తు " 🙏
" త్రివిధం నరకస్యేదం
ద్వారం నాశనాత్మనః,
కామక్రోధః తధా లోభః
తస్మాత్ యేతత్ త్రయం త్యజేత్ "
( భ.గీత 16:21 )
" కామక్రోధలోభాలు నరకద్వారాలు - కనుక వాటిని వదిలేయాలి " అని తెలియచేసారు పరమాత్మ గీతలో.
అసలు నరకం అంటే ఏమిటి. ఎప్పుడయినా ప్రయాణంలో తుఫాన్ లో చిక్కుకుంటే " అమ్మో నరకం చూసాం/కనబడింది " అంటారు. అంటే అధికకష్టాలు అనుకోవాలి.
ఏ చెడుపని చేసారో పాపాన్ని అనుభవిస్తున్నారు అంటూంటారు. అంటే పాపం, కష్టాలు ఒకటే అనుకోవాలి.
వ్యాసమహర్షి మహాభారతంలో అసలు పాపాలకి ( కష్టాలకి ) మూలం ఏమిటి అన్నది అద్భుతంగా తెలియచేసారు:
" పాపశ్చతు యదధిస్టానం
తత్ శృణుష్వ నరాధిపా,
ఏకో లోభో మహాగ్రాహో
లోభాత్ పాపం ప్రవర్తతే ".
అంటే పాపాలన్నిటికీ మూలం " లోభం " అని.
లోభం అంటే కావాలనుకోవడం. అది అక్కడితో ఆగదు - తనకే కావాలనుకోవడం, ఇంకెవరికీ ఉండకూడదనుకోవడం, అసూయ, కోపం, హింస అన్నీ ఒకటి తరువాత ఒకటి కలుస్తూంటాయి. అంటే పాపభవంతులకి పునాది "లోభం".
మరి పుణ్యం మాటేమిటి? దానికి మూలం ఏమిటి?. అది కూడా ఆయనే తెలియచేసారు:
" దమేన సదృశం ధర్మం
నాన్యం లోకేషు శుశృమః "
అంటే " పుణ్యానికి మూలం " దమం ". పుణ్యభవంతులకి పునాది " దమం ". దమం అంటే " ఇంద్రియనిగ్రహం ". స్పందించేముందు ఒక్క క్షణం ఆలోచనచేస్తే ఏ కష్టాలు దరిచేరవు.
ఈ దమం ని పొందాలంటే ఏమి చెయ్యాలి అన్నది మరొకసారి తెలుసుకుందాం.
వ్యాసర్షి అందుకే అన్నారు " ఇక్కడ ( భారతంలో ) ఉన్నదే ఎక్కడా ఉంటుంది, ఇక్కడలేనిది ఎక్కడా ఉండదు " అని. అంతటి అద్భుతమైనది ( ఇతిహాసం ) కనుకే పంచమవేదంగా పూజింపబడుతూంది 5000 సంవత్సరాలుగా.
అదీ మన సనాతనధర్మం గొప్పదనం. దీనికి సాటి మరియొకటిలేదు, రాబోదు.
నేడు అతిపవిత్రమైన " ముక్కోటి ఏకాదశి ". అందరికీ " దమము " ను ప్రసాదించి అనుగ్రహించమని ఆ పరమాత్మని వేడుకుంటూ - సూర్య.
ఏతత్ సర్వం శ్రీపరమాత్మార్పణమస్తు.
శుభం భూయాత్
Comments
Post a Comment