భగీత 18.63
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" ఇతితే జ్ఞానమాఖ్యాతం
గుహ్యాత్ గుహ్యతరం
మయా,
విమృశ్యైతదశేషేణ
యధేచ్ఛసి తధాకురు "
- భ.గీత 18:63
పరమాత్మ అర్జునుడితో అంటారు " నీకు రహస్యజ్ఞానమంతా చెప్పేసాను. నీ బుద్ధితోకూడా ఆలోచించుకుని నీకు ఇష్టమైన రీతిగా ఆచరించు " అని.
" వినదగు నెవ్వరు చెప్పిన " అన్నారు సుమతీశతకాచార్యుడు.
విన్నదానిలో మంచిని పాటించడమన్నది మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది.
మేము అమెరికా వెళ్ళినప్పుడు బాగా మంచుపడుతూంది. 3,4 వారాల తరువాత ఎండపొడ వచ్చింది. ఓ అరగంట బయటనడిచి వస్తాను అంటే మాకోడలు మీకు కొన్ని విషయాలు చెప్పాలి, కూర్చోండి అంది.
1. నడక మన కాలనీలోనే చెయ్యండి. ప్రక్క కాలనీలకు వెళ్లవద్దు. కాలనీలో కొత్తవారు కనిపిస్తే ఇక్కడ పొలీసులకు తెలియచేస్తారు వెంటనే. భయపడవలసినది ఏమీ లేకపోయినా జాగ్రత్తగా ఉండడం మంచిది.
2. మనం నడుస్తూన్నప్పుడు ఎవరయినా ఎదురుపడి అరనవ్వు నవ్వితే మనంకూడా అరనవ్వే నవ్వాలి. హాయ్ అంటే హాయ్ అని మాత్రం తప్పకుండా అనాలి. అంతకన్నా ఎక్కువగా మాట్లాడక పోవడం మనకి మంచిది.
3. ఎవరయినా వారి కుక్క, కుక్కపిల్లతో నడుస్తూ ఉండవచ్చు. ఆ కుక్క మిమ్మల్ని చూసి మొరిగితే ఆ యజమాని తనకుక్క మిమ్మల్ని అవమానించినట్లుగా భావించి " సారీ " అంటాడు. మీరు " ఓకే " అని ఓ అరనవ్వు నవ్వి ఎదరికి వెళ్ళిపోవాలి. మీరు అలా అనకుండా వెడితే అతను మీరు " ఓకే " అనేవరకూ మీకు " సారీ " చెబుతూనే ఉంటాడు. అంతగా ఫీల్ అవుతారు తన కుక్కవల్ల మీకు అవమానం జరిగిందని ఇక్కడ.
4. ఎదురుకుండా కారు వచ్చి షడన్ గా అగితే ఆశ్చర్యపోయి నుంచుండిపోకూడదు. ఆ కారు ఆగింది మీకోసమే. మీరు ఎదరికే వెడతారో రోడ్డుమీదకు దిగిపోతారో, కారు మిమ్మల్ని గుద్దేస్తుందేమో అని భయం వారికి. మీరు కారు దాటిపోయేవరకూ ఆ కారు ఎదరకు వెళ్ళదు. సాయంత్రం ఆఫీసులనుంచి వచ్చేసమయం కనుక ఓ కారు తరువాత ఇంకో కారు ఆగుతూ బారు పెరగవచ్చు. మీరు వీలయినంత వేగంగా ఎదరకి వెళ్ళిపోవడమే, కార్ల గురించి పట్టించుకోకుండా.
5. ప్రక్కనున్న ఇళ్ళవేపు సాధ్యమయినంతవరకూ చూడకుండా ఉండడం మంచిది.
6. ఎవరి ఇంటి ముందరయినా పూలచెట్లు పూలతో ఉంటే ముట్టుకోవడం, పూలు కొయ్యడం చేయకూడదు ( గులాబీ మొక్కలు 50/60 పువ్వులతో ఉండేవి ముచ్చటగా).
ఇవి విన్నప్పుడు నాకు చిన్నప్పుడు నేను ఎక్కిన గుర్రంబండి జ్ఞాపకానికి వచ్చింది. గుర్రం చూపు రోడ్డు మీదే ఉండేలా ప్రక్కచూపులు చూడకుండా దాని కళ్ళకి ప్రక్కన గంతలు కట్టేవారు.
అప్పుడు అలా అనిపించినా ఓ గుజరాతీ ఆయన్ని పొలీసులు తాము పిలిచినా ఆగలేదని ( అతనికి చెవుడు పాపం ) కుళ్ళపొడిచేసారని అతని లివరు కిడ్నీలు పాడయ్యాయని చదివినప్పుడు " ముందుజాగ్రత్త " మంచిదే కదా అనిపించింది.
ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment