భ.గీత 2.68

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏

" తస్మాద్యస్య మహాబాహో    

             నిగృహీతాని సర్వశః, 

  ఇంద్రియాణీంద్రియార్ధేభ్యస్తస్య 

             ప్రజ్ఞా ప్రతిష్ఠితా "

                          - భ.గీత 2:68

పరమాత్మ గీతలో " ఇంద్రియార్ధాలనుంచి నిగ్రహించుకోమన్నారు ". ఇంద్రియాలనే నిగ్రహించుకుంటే అంతకన్నా కావలసినదేమీ లేదు. కాని అది అంత సులభం కాదు. 

17వ శతాబ్దంలో దిల్లీ బాదుషా అర్ధసింహాసన గౌరవం, పండితరాజ మరియు కవిసార్వభౌమ బిరుదులు పొందిన మాగ్రామవాసి బంధువు అయిన జగన్నాధపండితులు తమ " శృంగారవిలాస " కావ్యంలో ఇలా వ్రాసారు:

" గరిమాణ మర్పయిత్వా, 

  లఘిమానం 

  కుచతటాత్కురంగ దృశాం, 

  స్వీకుర్వతే నమస్తే యూనాం  

  ధైర్యాయ నిర్వివేకాయ " 

      - శృంగార విలాసం శ్లో.46

యువకులు యువతులను చూడగానే వారి కుచతటములకు తమ వివేకజనితమైన " గురుత్వమును " అర్పించేసి ఆ కుచతటముల నుండి వారు " లఘి మానమును " అనగా చులకనతనమును స్వీకరించుచున్నారు. యువకులయొక్క అటువంటి నిర్వివేక విశిష్టమైన " ధైర్యమునకు " వందనములు. 

ఇక్కడ ఆశ్చర్యమేమిటంటే యువతుల కుచతటాలను చూసిన యువకులకు వందనం అన్నారు. అలా చూసినా వెంటనే తనబలహీనతను వదలి తనధర్మాన్ని తెలుసుకొని తిరిగిపొందిన వారి ధైర్యం/నిగ్రహం కి వందనములు అన్నారు పండితుడు.

కాళిదాసుమహాకవి " వికారహేతౌ సతి విక్రయంతే " - " ఎదురుగా వికార సంఘటనులు జరిగినా వికారానికి లోను కానివాడు ధీరుడు " అన్నారు.

పూజ్యులు గరికిపాటివారు యువతుల వస్త్రధారణ గురించి మాట్లాడుతూ " ఏదేదో పిచ్చివ్రాతలున్న టీషర్ట్ వేసుకుని తిరుగుతూ యువకులు తదేకంగా చూసారని బాధపడితే ఎలా. 21-25 ఏళ్ళ యువకుడు అలా చూడకపోతేనే ఆశ్చర్యపడాలి, చూడలేదంటే అతనిలో ఏదో లోపం ఉన్నట్లు అర్ధం " అన్నారు.

బయట తిరుగుతూన్నప్పుడు మనస్సును చలింపచేసే విషయాలు చాలా కనబడుతూంటాయి. చూడకుండా ఉండడం కుదరదు, చూడడం తప్పుకాదు. వాటితో ఆకర్షింపబడకుండా నిగ్రహంతో ఉండాలి. అదే పరమాత్మ చెప్పినది గీతలో.

అటువంటి " నిగ్రహం " ని ప్రసాదించి ఆశీర్వదించమని అమ్మవారిని వేడుకుందాం.

ఈరోజు హోళీ పౌర్ణమి. శుభాకాంక్షలు. 

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య. 

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ