భగీత 3.5
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏
" నహి కశ్చిత్ క్షణమపి
జాతు తిష్ఠతి అకర్మకృత్,
కార్యతే హి అవశః కర్మ
సర్వః ప్రకృతిజైః గుణైః "
- భ.గీత 3:5
" జీవుడు కర్మ చెయ్యకుండా క్షణం కూడా ఉండలేడు. అది ప్రకృతిపరంగా వచ్చిన గుణాలు ( సత్వ తమో రజోగుణాలు ) కారణంగా " అని పరమాత్మ సెలవిచ్చారు గీతలో.
" న హి దేహభృతా శక్యం
త్యక్తుం కర్మాణ్యశేషతః,
యస్తు కర్మఫలత్యాగీ స
త్యాగీత్యభిధీయతే "
- భ.గీత 18:11
శరీరధారి కర్మలు చెయ్యకుండా ఉండడం అశక్యం ( త్రిగుణాల కారణంగా ). కనుక కర్మలనుగాక కర్మఫలాలను విడిచిపెట్టినవాడే నిజమైన త్యాగి అని స్వామి తెలియచేసారు.
అందుకే ఆయన అన్నది " కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన " అని అంటే " కర్మ చేసేయ్, ఫలితం గురించి ఆలోచించకు " అని.
ఎందుకు ఆలోచించకు అన్నారంటే తను అనుకున్న ఫలితం రాకపోతే బాధపడవలసి వస్తుందని.
ఏ కర్మకైనా ఫలితం ఉండి తీరుతుంది కాని ఆ ఫలితం తను ఆశించినట్లు ఉండకపోవచ్చు. కనుక అనుకున్నది జరగలేదని బాధపడుతూ కూర్చోకూడదు. ఫలితం లేని కర్మ ఏదీ ఉండదు. ఏ కోరికలూ లేని నడిచే దేముడు కంచి పరమాచార్యులు శ్రీచంద్రమౌళీశ్వరుని పూజ చేసినా లోకకళ్యాణం అనే ఫలితం వస్తుంది.
" అమరావతి " రాజధాని అనుకోవడం, పి ఎం గారు వచ్చి ప్రారంభోత్సవం చెయ్యడం జరిగింది. అది దేవతల రాజధాని అన్నారు. బౌద్ధుల పవిత్ర క్షేత్రమన్నారు. చిన్న చితకా రైతులతో సహా అందరూ 33 వేల ఎకరాలు ఇచ్చారు. దేశవిదేశాల్లో అందరూ ఆశ్చర్యపోయారు. 100 ఎకరాలు తీసుకోవడానికే ప్రభుత్వాలు నానా తంటాలూ పడుతూంటే ఏ గొడవలూ లేకుండా ఇన్ని ఎకరాలు ఎలా తీసుకోగలిగాడు, అంత పకడ్బందీగా అలా ఎలా చెయ్యగలిగాడు ఆ నాయకుడు అని ముక్కుమీద వేలు వేసుకున్నారు. పెట్టుబడులు పెడతామని మేమంటే మేము అంటూ వరల్డ్ బేంకు, సింగపూర్, కొరియా, జపాన్ మొ గు దేశాలు పోటీపడి మరీ ముందుకు వచ్చాయి. ప్రభుత్వమే అపార్టుమెంట్లు కట్టి ఇస్తానంటే హాట్ కేకుల్లా అమ్ముడయి పోయాయి. ఆ నాయకుడి ముందు ( మందు కాదు ) చూపుకి, ఆంధ్రుల అదృష్టానికి, అక్కడ పెట్టుబడులు పెట్టినవారి తెలివితేటలికి అందరూ ఆశ్చర్యపోవడమే కాక " అమరావతి " విశ్వనగరం అవడం ఇక ఎంతో దూరంలో లేదని అందరూ నిశ్చయమయిపోయారు.
అంత పకడ్బందీగా ఎంతో జాగ్రత్తగా చేసిన పని ( కర్మ ) ఏమయింది, ప్రశ్నార్ధకమయింది.
అమరావతి కాస్తా " భ్రమరావతి, గ్రాఫిక్స్, ఎడారి, శ్మశానం " అయిపోయింది. ప్రపంచాన్నే మెప్పించినాయన ఏమిచేయాలో తెలియక దిక్కులు చూస్తున్నారు.
5000 వేల ఏళ్ళక్రితమే పరమాత్మ స్పష్టంగా చెప్పిన విషయం అదే - పని మాత్రమే చెయ్యి, ఫలితం గురించి " ఎక్కువగా " ఆలోచన చెయ్యకు, ఎక్కువగా బాధపడకు అని. కడివెడు పాలైనా ఒక్క ఉప్పురాయి పడితే విరిగి చెడిపోతాయి.
ఏతత్ సర్వం శ్రీశ్రీకృష్ణార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment