పండితరాజ 6
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏
" కిం మాలతి! మ్లాయసి మాం
విహాయ,
చు చుంబ తుంబీకుసుమం
షడంఘ్రిః,
లోకే చతుర్భి శ్చరణైః పశుస్యాత్,
స షడ్భిరత్యర్ధ పశుర్న కిం స్యాత్ "
మాలతీ పువ్వుమీద తుమ్మెద వాలదు. తుమ్మెదకు ఆరుకాళ్ళు ఉంటాయి, " షడంఘ్రి " అన్నారు. ఇది దృష్టిలో పెట్టుకుని జగన్నాధపండితరాయలు ( 17వ శతాబ్దం - మాబంధువు, మాగ్రామవాసి ) ఇలా వ్రాసారు:
" ఓ మాలతీ, 4 కాళ్ళు ఉన్న జీవిని పశువు అంటారు. ఆరుకాళ్ళు ఉన్న తుమ్మెద ఇంకో అరపశువు ( 2 కాళ్ళు ఎక్కువ ) ఎక్కువ. అంటే 1 1/2 పశువు. అటువంటిది నీ మీద వాలటం లేదని నువ్వు బాధపడతావెందుకు " అని.
పండితుల అభిప్రాయమేమిటంటే సహజంగానే ఈయనపై అసూయతో ఉన్న మిగతాపండితులు ఈయనతో సఖ్యంగా ఉండేవారుకాదేమో అందుకని ఈయన ఈవిధంగా వ్రాసి ఉంటారు అని.
" జగత్ప్రాణే ప్రౌఢే నికట
ముపయాతేసతి హఠాత్,
వినం రా ఆం రాద్యాః శుకపిక
వచశ్చాటుపటవః,
సురాభాండం కంఠేవహతి న నతే
తాళహతకే,
సుదుర్వృత్తే తస్మిన్ క్షతిరహపునః
కాచ మహతాం "
అంటే " జగత్తునంతటికీ ప్రాణాధారభూతుడు మహానుభావుడు అయిన వాయుదేవుడు రాగానే మామిడి పనస వంటి మంచిమంచి చెట్లు అన్నీ తలలువంచి నమస్కరిస్తున్నాయి. ఆచెట్లమీదున్న కోకిలలు చిలుకలు కలధ్వనులు చేస్తూ ఆయన్ని అహ్వానిస్తున్నాయి. ఓరీ తాటిచెట్టూ కల్లుకుండలు మెడకు కట్టుకుని నీవు ఒక్కడివే వంగకుండా ఉన్నావు. నీ అల్పత్వమే బయటపడింది కాని మహాత్ములకు నష్టమేముంది " అని.
చక్రవర్తిసభలో ఈయన ప్రవేశిస్తూన్నప్పుడు అక్కడున్న పండితులు/సభికులు అందరూ శిరస్సువంచి గౌరవిస్తూన్నప్పుడు ఎవరో ఒక సభికుడు అలా గౌరవించకపోవడంతో ఆ సభలో ఈయన ఈ పద్యం చెప్పి ఉంటారని పండితుల/విమర్శకుల అభిప్రాయం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment