పండితరాజ 3
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏
డిల్లీ బాదుషా మా ఊరి పండితుడు , మా బంధువు ( 17వ శతాబ్దం ) అయిన శ్రీ జగన్నాధపండితరాయలుకి " పండితరాజ " అని బిరుదు ఇచ్చి గౌరవించినట్లుగా ఓ సారి వ్రాయడం జరిగింది. ఆ సత్కారం సందర్భంగా ఓ సన్మానసభను ఏర్పాటు చేసారు. ఆ సభలో ఈయన్ని ఓ చక్కటి పద్యం/శ్లోకం చెప్పమన్నారు.
మనం తెనాలి రామలింగడు కధల్లోనూ , సినీమాల్లోనూ చూసాం. తోటి కవులు ఆయన్ని ఎన్నివిధాలుగా అవమానించాలని చూసారో, ఈయన తన తెలివితేటలతో ఎలా బయటపడ్డారో.
ఈ సమస్య ఎప్పుడూ ఉంటుంది, జగన్నాధుని కాలంలోనూ ఉంది.
ఈయన అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని ఆశువుగా ఒక శ్లోకం చెప్పారు:
" త్రపశ్యామ జంబూర్దళిత
హృదయం దాడిమీఫలం,
సశూలం సంధత్తే
హృదయమభిమానేన పనసః,
భయాదంతస్తోయం తరుశిఖరజం
లాంగలిఫలం,
సముద్భూతే చూతే జగతి
ఫలరాజే ప్రసరతి "
ఓ సారి అడవిలోని పళ్ళ చెట్లన్నీ కలిసి ఓ పండురాజుని ఎన్నుకుందామనుకున్నాయిట. సహజంగానే మంచిరంగు, మంచి సువాసన, మంచి రుచి , మంచి ఆకారం ఉండడంతో మామిడి పండు " పండు రాజు " గా ఎన్నుకోబడింది. అది చూసి నేరేడు పండు ముఖం నల్లగా మాడిపోయిందిట ( నల్లగా ఉంటుంది ). దానిమ్మపండు మనస్సు వెయ్యి ముక్కలయ్యిందిట ( లోపల ఎర్రగా ఎన్నో గింజలు విడివిడిగా ఉంటాయి ). పనసపండు అభిమానంతో హృదయంలో శూలాన్ని దింపుకుందిట ( పనసపండు కొయ్యడానికి ముందర కత్తితో పొడుస్తారు ). చెట్టుపైన ఉన్న కొబ్బరి(కాయ) గుండె చెరువయ్యిందిట ( లోపల నీరు ఉంటుంది ). " అని.
ఈ పళ్ళన్నీ గొప్పవే. అన్నీ మనం ఇష్టంగా తినేవే. కాని ఒక్కొక్కదానికి ఓ లోపం ఉంటూ ఉంటుంది. ఆలోపాలను దృష్టిలో పెట్టుకుని ఈ అద్భుత అలంకారపద్యం ని చెప్పారు.
ఇలాంటి హాస్యం/వెటకారం కలిసిన పద్యాలు ఆయన చాలానే చెప్పారని అంటారు.
ఇటువంటి రసరమ్యతను " రసశేవధిః " అయిన అమ్మవారు ఇస్తుంది.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment