పండితరాజ 1

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏

" క్రమశిక్షణ " ( Discipline )

ఒక మనిషి జీవితంలో అద్భుతస్థాయికి వచ్చారంటే వారి బాల్యదశ ఎంతటి క్రమశిక్షణతో గడిచి ఉంటుందో తెలుసుకోవాలి.

మాగ్రామవాసి, బంధువు పండితరాజ జగన్నాధరాయలు ( 17వ శతాబ్దం ) క్రమశిక్షణ విలువ గురించి, అవసరం గురించి కొన్ని అద్భుతమయిన శ్లోకాలు చెప్పారు. తన 25వ ఏటకే పండితరాజ బిరుదుతో గౌరవింపబడి ఢిల్లీబాదుషా అర్ధసింహాసనాన్ని అలంకరించారంటే ఎంత క్రమశిక్షణతో పెరిగారో ఊహించుకోవచ్చు.

" పాషాణదపి పీయూషం 

  స్యందతే యస్య లీలయా, 

  తంవందే పేరుభట్టా2ఖ్యం, 

  లక్ష్మీకాంతం మహాగురుం " 

                   రసగంగాధరం,  

       ప్రధమాననం 3వ శ్లోకం.

ఆయన రచించిన అద్భుత అలంకారకావ్యం " రసగంగాధరం " లో " తన తండ్రియొక్క పాండిత్య ప్రభావలీలకు బండరాయి ( తను ) కూడా అమృతాన్ని స్రవిస్తుంది. మహాగురువైన తండ్రి పేరుభట్టుగారికి తల్లి లక్ష్మీకాంతంగారికి నమస్కారములు " అని మొదటి వందనములు తెలియచేసారు.

తనను తాను " బండరాయి " తో పోల్చుకున్నారు పండితరాయలు. 

" గీర్భిర్గు రూణాం పరుషాక్షరాభిః, 

  తిరస్కృతా యాంతి  

                       నరామహత్వం, 

  అలబ్దశా ణోత్కషణా నృపాణాం, 

  న జా తు మౌళౌ మణయో   

                       వసంతి " 

                     -  భామినీవిలాసం.

తమ విద్యాభ్యాస సమయంలో విద్యార్ధులు గురువులచే కఠినపుమాటలతో తగినంతగా దండింపబడినప్పుడే వారు అచిరభావిలో ఉన్నతపౌరులై విద్యావంతులై ఉన్నతపదవులను గౌరవములను పొందుతారు. ఉత్తమమయిన మణిజాతిలో పుట్టిన మణికూడా ద్రవాలతో కడగబడక సానపెట్టబడకపోతే మహారాజుల కీరీటంలో చేరదుకదా. 

ఇంకో అద్భుతమయిన ఉదాహరణ కూడా ఇచ్చారు క్రమశిక్షణకి. 

పల్లకీ పైభాగం తయారు చేయడానికి వంగిన వెదురుగడలు కావాలి. ఏడాదిలోపే వెదురుమొక్కకు వంచిన ఇనుపచువ్వలు కడితే కొన్ని నెలలలో వంగినవి తయారవుతాయి, పల్లకీ తయారవుతుంది. దానిలో మహారాజు కూర్చుంటే ఈ వెదురుబొంగు ఆయన తలపైన ఉంటుంది. అలా " క్రమశిక్షణ " తో పెరగకపోతే లావుగా నిటారుగా తయారయి దొమ్మరివారు వీధుల్లో గారడీలు చెయ్యడానికి ఉపయోగించబడి వాళ్ళ కాళ్ళక్రింద నలుగుతూ ఉంటుంది " అని.

అలా క్రమశిక్షణతో పెరిగినవారు బాధ్యతగల పౌరులుగా తయారవుతారని, లేకపోతే సమాజానికి దేశానికి భారంగా తయారవుతారని పలు సందర్భములలో తెలియచేసారు పండితరాజ.

మనమందరం " క్రమశిక్షణ " తోనే పెరిగామని చెప్పుకోవడానికి ఏమాత్రం సందేహించనక్కరలేదు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య. 

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ