కామాక్షీదయ
🙏 " శ్రీరస్తు శుభమస్తు " 🙏
నేను 1980లలో మద్రాస్ లో ఉన్నప్పుడు మాంబళంలో ఓ ఇంట్లో మకాం ఉండేవారం. గేటు తీయగానే ఎదురుకుండా ఉండే పోర్షన్లో మేము, పై పోర్షన్లో ఓ ఉత్తరదేశీయకుటుంబం, క్రింద వెనుక పోర్షన్లో యజమాని కుటుంబం మకాం. గేటులోంచి లోపలికి రాగానే కుడిపైపుకి తిరిగి 15 అడుగులు వేసి ఎడమవైపుకి తిరిగి వెనక్కువెడితే యజమానుల పోర్షన్.
యజమాని పూర్వీకులది మచిలీపట్నం. తెలుగు తమిళ్ యాసతో బాగానే మాట్లాడేవారు. వెనుక పోర్షన్లో ఎందుకంటే దానికి ప్రక్కనే వారి ఖాళీ స్థలంలో హాస్పిటల్ కడుతున్నారు. ఆయన భార్య డాక్టర్, ఈయన ప్రభుత్వ సివిల్ ఇంజనీర్.
ఈయనకు దైవభక్తి ఎక్కువే. ఇంటిపైన పెద్దపాకవేసి " ఓంశక్తి " పీఠం పెట్టించారు. పూజలు అవీ అవుతూ ఉండేవి.
మా పోర్షన్ ప్రక్కనే వారి ఆవును కట్టి ఉంచేవారు. రోజూ లేవగానే మాకు గోదర్శనం. బావుండేది.
హాస్పిటల్ రెడీ అయింది. వారు దాని ప్రారంభోత్సవానికి కంచిపీఠాధిపతి పరమాచార్యులని ఆహ్వానించారు. పెద్దాయన రాలేనని జయేంద్రసరస్వతిని పంపిస్తానన్నారు.
అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. స్వామివారు సాయంత్రం 6 కి వస్తానన్నారు.
ఎలాగూ సాయంత్రంకదా అని నా శ్రీమతి ఆవుపేడతో కళ్ళాపి చల్లి ఓ 5,6 పెద్ద ముగ్గులు వేసింది, గ్రామంలో ముఖ్యంగా సంక్రాంతిపండుగుల్లో అలవాటు కనుక.
స్వామివారు వచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. హాస్పిటల్ " ప్రసూతి ఆసుపత్రి ". దానిలోకి ఆయన ప్రవేశించరు. అందుకని " మీ ఇంటిలోకి వస్తాను నడవండి " అన్నారు స్వామి యజమానితో. అందరూ ఆయన్ని అనుసరిస్తూండగా గేటుదగ్గరికి వచ్చారు. గేటు తీసేఉంది, నా శ్రీమతి గేటుదగ్గర నుంచుని ఉంది. స్వామి ఒక్కక్షణం ముగ్గులను చూసి మా ఇంట్లోకి వచ్చేసారు, దేవుడి గది ఎక్కడా అంటూ లోపలికి వెళ్ళిపోయారు. సాయంత్రం అయితే అన్ని రూముల్లోనూ లైట్స్ వేసి ఉంచుతాం , ఎప్పుడూ అలవాటే.
అందరికీ ముఖ్యంగా యజమానికి మతిపోయింది. 5 ని.ల్లో స్వామి పరివారం తిరిగి వెళ్ళిపోయారు.
" ఇదీ మీ ఇల్లేగా " అని యజమానికి అందరూ సర్దిచెప్పారు. చాటుగా " ఏమి అదృష్టవంతులండీ మీరు " అని మాతో అన్నారు.
అమ్మవారు " సంప్రదాయేశ్వరి ", సంప్రదాయాలకు అంతటి విలువనిస్తుంది - సూర్య.
ఏతత్ సర్వం శ్రీకంచికామాక్షిదేవ్యార్పణమస్తు.
శుభం భూయాత్
Comments
Post a Comment