అంజనా నందనం
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏
" అంజనా నందనం వీరం జానకి
శోకనాశనం,
కపీశమక్షహంతారం వందే లంకా
భయంకరం ".
" యత్రయత్ర రఘునాధకీర్తనం
తత్రతత్ర కృతమస్తకాంజలిం,
భాష్పవారి పరిపూర్ణలోచనం
మారుతిం నమత రాక్షసాంతకం "
మొదటి శ్లోకం లో సీత శోకాన్ని పోగొట్టిన అరివీరభయంకరుడు. రెండవ శ్లోకంలో తలవంచుకుని చేతులు కట్టుకుని కళ్ళనిండుగా నీళ్ళతో నుంచుని ఉన్న హనుమ. ఎక్కడ రామకీర్తన జరుగుతూన్నా హనుమ అక్కడ అలా నుంచుని ఉంటాడు. ఎంత తేడా. భక్తికి పరాకాష్ఠ. అందుకే " భక్తానాం అగ్రగణ్యం " అని కీర్తింపబడ్డాడు.
లంకకు నిప్పుపెట్టేసాక హనుమ సముద్రపు ఒడ్డుకు చేరుకుంటాడు. అయ్యో ఎంతపని చేసాను, కోపం ఎంత చెడ్డది, మనిషి విచక్షణజ్ఞానాన్ని నశింపచేస్తుంది కదా, రావణుడిమీద కోపంతో అలా అంటించేయడమేమిటి, ఇప్పుడు సీతమ్మ పరిస్థితి ఏమిటి. ఆమె కూడా అగ్నికి ఆహుతి అవుతే రామలక్ష్మణులు సుగ్రీవుడు వానరవీరుల పరిస్థితి ఏమిటి, అందరూ ప్రాణాలు విడుస్తారు కదా " అని బాధపడతాడు. తనకి మరణమే శరణ్యం అనుకుంటాడు ఒక్కక్షణం. వెంటనే అనుకుంటాడు " నన్నే అగ్నిదేవుడు బాధపెట్టలేదు, ఇంక మహాసాధ్వి సీతమ్మని ఎలా బాధపెడతాడు " అని సర్దిచెప్పుకుంటాడు. హనుమకు తెలియదు సీతమ్మ హనుమను బాధపెట్టవద్దని అగ్నిని ప్రార్ధించినట్లుగా.
కోపం మనిషికి ఎంత అనర్ధహేతువో తెలియచేసారు హనుమ. వినయం ఎంతటి ఉన్నతిని కలుగచేస్తుందో తెలుసుకోవడానికే హనుమే నిదర్శనం.
అందుకే హనుమని తలుచుకుంటే చాలు అష్టసిద్ధులు, నవనిధులు లభిస్తాయని సీతమ్మ హనుమకు వరం ఇచ్చింది.
ఈరోజు " దమన పూర్ణిమ "- దమం అంటే ఇంద్రియనిగ్రహం. అది హనుమ ప్రసాదిస్తారు. మొదటి శ్లోకంలోని " అక్షహంతారం " అంటే అర్ధం అదే.
ఈరోజు చైత్ర పూర్ణిమ, హనుమద్విజయోత్సవం రోజు. అందరికీ ఆరోగ్యాన్ని, అభయాన్ని, ఇంద్రియనిగ్రహంని, భక్తిని ప్రసాదించమని కోరుకుందాం.
అందరికీ హనుమద్విజయోత్సవం రోజు శుభాకాంక్షలు. జైశ్రీరాం.
ఏతత్ సర్వం శ్రీహనుమార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment