ఋషులు

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏

ఋషులు ఏపనిచేసినా, తపస్సు చేసినా లోకకల్యాణం కోసమే. తెలిసి వారు ఏతప్పూ చేయరు. కాని వారికి తెలియకుండానే కొన్ని దోషాలు వారికి తగులుకుంటూంటాయి. వారు "తపస్సు " చేసేది ఇలాంటి దోషపరిహారాల కోసం కూడా.

మహర్షులుకూడా ఒక్క చిన్న అసత్యమాడితే వారి తేజస్సు హరించుకుపోతుంది. అందుకే ఋషులు తెలిసో తెలియకో ఎప్పుడయినా అసత్యమాడి ఉండవచ్చు అని తలచి ఆ అసత్యదోషనివారణ కోసం సరస్వతీవ్రతం, ' సారస్వతేష్టి ' యజ్ఞం చేస్తారు. ఈవిషయం రాముడు తనతల్లి కౌసల్యకు అరణ్యవాసానికి వెళ్ళేముందర చెబుతాడు, తనతండ్రికి తనవల్ల అసత్యదోషం రాకూడదని.

ఓ ఋషి ఒక అత్యవసరపని మీద వేరే ప్రదేశానికి వెడుతున్నారు. ఎండబాగా ఎక్కువగా ఉంది. కమండలంలోని నీరుత్రాగి ఏదయినా పండు ఒకటి తింటేనయమని చుట్టూ చూస్తే ఓ పెద్ద చెట్టు ఒకటి పలుకొమ్మలతో ఆకుపచ్చటి ఆకులతో కనిపించింది కొద్దిదూరంలో. దాని దగ్గరకు వెళ్ళారు, ఓ పండో కాయో తిందామని. ఆశ్చర్యంగా దానికి ఓ పువ్వుకాని కాయకాని లేదు. మనభాషలో అది మగచెట్టు. సరేలే అనుకుని ఎదరకి వెళ్ళిపోయారు. 3,4 రోజుల తరువాత పని అయిపోవడంతో తిరుగుప్రయాణమయారు. దారిలో ఆచెట్టును చూస్తే మాడిపోయి ఉంది. ఋషికి ఆశ్చర్యం వేసింది. మొన్ననే కదా పచ్చగా నిగనిగలాడుతూ ఉంది, ఇలా ఎలా మాడిపోయిందీ అని.

దివ్యదృష్టితో చూసి కంగుతిన్నారు. మొన్న ఈయన నిరాశగా వెళ్ళిపోగానే ఆ చెట్టు " లోకకల్యాణంకోసం శ్రమపడే ఓ మహర్షి ఓ పండుకోసం తనదగ్గరకు వస్తే ఓ కాయను కూడా ఇవ్వలేని తను జీవించి ప్రయోజనమేమిటి, తన బ్రతుకు వృధా " అని తలచి ఆత్మార్పణ చేసుకుంది. 

అయ్యో తన ఆకలి ఓ జీవి ప్రాణాన్ని తీసిందే అని బాధపడి తన తపశ్శక్తిని ధారపోసి దానికి సద్గతి కలిగేలా చేసారు.

అలా వారికి తెలియకుండానే కొన్ని దోషఫలాలను కూడా పొందుతూంటారు ఋషులు. అందుకే వారు చాలా జాగ్రత్తగా, అప్రమత్తతతో జీవిస్తూ సదా " తపస్సు ( దోషపరిహారార్ధం కూడా ) " చేసుకుంటూంటారు.

ఋషులున్నచోట స్తీలున్నచోట శ్రీరాముడు అతితక్కువగా మాట్లాడేవాడుట. వారికి తన మాటలవల్ల ఏదయినా అసౌకర్యం కలగవచ్చునేమో అని. మార్యాదాపురుషోత్తముడు. 

ఏతత్ సర్వం శ్రీశ్రీరామార్పణమస్తు - సూర్య. 

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ