మూకపంచశతి
🙏" శ్రీమాత్రేనమః"🙏
" సధ్రీచే నవమల్లికాసుమనసాం
నాసాగ్రముక్తామణేః,
ఆచార్యాయ మృణాలకాండ
మహసాం నైసిర్గికాయ త్విషే,
స్వర్ధున్యా సహ యుధ్వనే
హిమరుచేరర్ధాసనాధ్యాసినే,
కామాక్ష్యాః స్మితమంజరీ
ధవలిమాద్వైతాయ తస్మై నమః"
అమ్మవారి చిరునవ్వు ఎంత నిర్మలంగా అందంగా ఉంటుందంటే ఆ నవ్వుముందు మల్లెపూలు, చంద్రవంక, ఆకాశగంగ కూడా దిగతుడుపే అని తెలుసుకోవాలి.
మూకకవి/మూకశంకరులు కామాక్షీ అమ్మవారి దర్శనకటాక్షంతో ఆశువుగా 500 శ్లోకాలతో అమ్మవారిని ప్రార్ధన చేసారు. అది " మూకపంచశతి " గా ప్రసిద్ధిచెందింది. అమ్మవారి చిరునవ్వుమీదే 100 శ్లోకాలు చెప్పారు. అదే మూకపంచశతి లోని " మందస్మితా శతకం ". వాటిలో ఒక శ్లోకం ఇది.
శివుడు చంద్రవంకను, గంగను ధరించి విభూతిని శరీరమంతా పూసుకుంటాడు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఓ కవి మూకశంకరుల పై శ్లోకానికి చమత్కారంగా ఇలా భాష్యం చెప్పారు:
కైలాసంలో కొలువై ఉన్నప్పుడు శివుడు ఓ సారి ఎడమవైపున ఉన్న అమ్మవారివైపు చూసారుట. అమ్మవారు ఓ చిరునవ్వు నవ్విందిట. ఈయన " ఎంత అద్భుతంగా అందంగా ఉంది ఈ నవ్వు, దీనికన్నా అందమైనది ఏముంది " అని అనుకుని నెత్తిమీద చంద్రవంకని పెట్టుకుని చూసారుట. అబ్బే అసలు పోలికే లేదు అనుకుని ఆకాశగంగని తలపైన పెట్టుకుని చూస్తే " అబ్బే " అనిపించిందిట. మల్లెపూలు సరే సరి. అప్పటినుంచీ అమ్మవారి చిరునవ్వుకి సాటి ఏదీ లేదు అనుకుని తెల్లటి విభూతిని వంటినిండా పులుముకుని తిరగడం మొదలు పెట్టారుట శివుడు. ఎంత అద్భుతభావన.
అందుకే అమ్మవారిని " దరహాసోజ్వలముఖీ " అని ప్రార్ధిస్తాం. చక్కటి చిరునవ్వుతో వెలిగిపోతూ ఉంటుందిట అమ్మవారి ముఖం.
దీపం అంధకారాన్ని పోగొట్టి దారి చూపిస్తుంది. అమ్మవారి చిరునవ్వు అశాంతిని పోగొట్టి సత్సంకల్పాలు కలిగేలా అనుగ్రహిస్తుంది.
" తన్మే మనః శివసంకల్పమస్తు ( సంకల్పసూక్తం ) " - " మా మనస్సులలో మంచి సంకల్పాలను కలిగించు " అని పార్ధించినా అమ్మవారి అనుగ్రహం కూడా తోడవ్వాలి.
మన జీవితాలను కూడా " చిరునవ్వుమయం " చేసి అనుగ్రహించమని కోరుకుందాం అమ్మవారిని.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment