శివానందలహరి
🙏 " శ్రీరస్తు శుభమస్తు " 🙏
" సదా మోహాటవ్యాం చరతి
యువతీనాం కుచగిరౌ,
నట త్యాశాశాఖా స్వటతి ఝడితి
స్వైర మఖికః,
కపాలిన్ భిక్షో మే హృదయకపి
మత్యంత చపలం ,
ధృఢం భక్త్వా బద్ధ్వా శివ
భవదధీనం కురు విభో "
ఆదిశంకరులు " శివానందలహరి " చేస్తూ అంటారు " ఓ ఈశ్వరా - నా హృదయం ( మనస్సు ) మోహం అనే అడవిలో తిరుగుతూంది. నా మాట వినడం లేదు. అతి చపలమైన నా మనస్సనే కోతిని దయచేసి నా భక్తి ( అనే తాడు ) తో కట్టి నీ దగ్గర ఉంచుకో స్వామీ " అని.
ఎంత అద్భుత పరిశీలన. సామాన్యమానవులు ఎంతటి మానసిక దౌర్బల్యంతో బాధపడుతూంటారో ఎంత చక్కగా తెలియచేసారు.
" చంచలం హి మనః కృష్ణ ప్రమాధి
బలవద్దృఢం,
తస్యాహం నిగ్రహం మన్యే
వాయోరి సుదుష్కరం"
- భ.గీత 6:34
అర్జునుడు అంటాడు పరమాత్మతో " మనస్సు చంచలమయినది, వాయువులాగానే దీనిని నిగ్రహించడం కష్టము కదా " అని.
" అసంశయం మహాబాహో మనో
దుర్నిగ్రహం చలం,
అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ
చ గృహ్యతే "
- భ.గీత 6:35
పరమాత్మ అంటారు " మనస్సును నిగ్రహించడం కష్టమే కాని వైరాగ్యంతో కూడిన అభ్యాసంతో సాధ్యమే సుమా " అని.
వేదంలో " సంకల్పసూక్తం " ఉంది. దానిలో " తన్మే మనః శివసంకల్పమస్తు " - " మా మనస్సుల్లో ఎప్పుడూ మంచి ఆలోచనలే కలిగేలా అనుగ్రహించు " అని పరమాత్మని ప్రార్ధిస్తాం.
" .......శాశ్వతగుం శివమచ్ఛిదం " - శివనామస్మరణ చేస్తే ప్రపంచశాంతి కలుగుతుంది.
ఈరోజు పరమపవిత్రమయిన శివరాత్రి. పైగా శనిత్రయోదశి. అందరి మనస్సుల్లోనూ శుభసంకల్పాలనే కలిగిస్తూ ప్రపంచశాంతిని ప్రసాదించమని పరమాత్మని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరమాత్మార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment