నమ్మకం దేముడు
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏
దేవుడు ఉన్నాడా, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటూ కొందరు మేధావులు తెగ ఆలోచన చేస్తూంటారు.
యజ్ఞం అంటే నమ్మకంతో చేసే కర్మ. సత్కర్మలు అసత్కర్మలు అని రెండురకాలు. అసత్కర్మలు అంటే అపనమ్మకంతో చేసేపనులు. దొంగతనం హత్యలు లాంటివి కావు.
మా మేనత్తగారు దృష్టి ( దిష్టి ) మంత్రం వేసేవారు. వీభూతి మంత్రించి ఇచ్చేవారు. ఓ గ్రహణసమయంలో నేను మాగ్రామంలో ఉండడంతో ఆవిడ " రేపు గ్రహణసమయంలో స్నానం చేసి రా, మంత్రోపదేశం చేస్తాను " అన్నారు. వెళ్ళాను. మొదట ఆవిడ అన్నది " మంత్రం వినగానే ' ఇదేమిటి, ఇదామంత్రం ' అనే ఆలోచన రానీయకు " అని. నమ్మకం ముఖ్యం, ఆరోజు మొదలుకుని గత 40 ఏళ్ళుగా రోజూ కనీసం 11 సార్లు దానిని మననం చేస్తాను.
నేను పదో పదకొండో చదువుతూన్నప్పుడు తీవ్రమైన కరువు. 15,16 నెలలుగా వర్షాలు లేవు. నిండుగా ఉండే మా చెరువు కూడా 5,6 పాంచాలు క్రిందకు వెళ్ళిపోయింది. ఏదో ఒకటి చేయాలనుకున్నారు. ప్రక్కగ్రామాల నుంచి కూడా ఒత్తిడి పెరిగింది ఏదో ఒక కార్యక్రమం తలపెట్టండి మహాశయా అని.
శివుడికి సహస్రఘటాభిషేకం చెయ్యడానికి నిర్ణయం జరిగింది. చెరువు నుంచి గుడికి 2 ఫర్లాంగులు ఉంటుంది. ఉపవాసంతో 1000 బిందెలు నీళ్ళు మొయ్యాలంటే కనీసం 25 మంది కుర్రాళ్ళు కావాలి. మమ్మల్నందరినీ రెడీగా ఉండమన్నారు.
ఆరోజు రానే వచ్చింది. ఒంటిగంటకు 600 బిందెలు మోసాం. 2 గం.కు ఆకాశం ఆశ్చర్యకరంగా నల్లటిమబ్బులతో నిండిపోయింది. ఎదరమనిషి కూడా గుర్తు తెలియటంలేదు. చల్లటి గాలి మొదలయ్యింది. ఏ క్షణాన్నయినా వర్షం మొదలవుతుంది. నీరసంతో కాళ్ళు తడబడుతున్నాయి. ఎలా, ఏమి చెయ్యాలి.
పెద్దవారు ఓ నిర్ణయనికి వచ్చారు. రెండెడ్ల బండ్లు 2 తెప్పించి, పెద్ద గుండిగలు పెట్టి చెరువు దగ్గర వాటిని ఓ బేచ్ నింపడం గుడి దగ్గర ఓ బేచ్ బిందెలలో పోసి లోపలికి పట్టుకెళ్ళడం అన్నట్లుగా. వెంటనే బళ్ళు వచ్చాయి, పని మొదలయ్యింది. 6 గం.కు అభిషేకం అయింది. 5 గం.ల నుంచి మొదలయి మేఘాలన్నీ మాయమయిపోయి ఎండ వచ్చేసింది. మతిపోయింది అందరికీ, ఒక్కరి మొహాల్లోనూ నెత్తురుచుక్క లేదు. కళాకాంతులు పోయాయి. పొరపాటయిందని లెంపలు వేసుకున్నారు అందరూ. రాత్రి గ్రామసంతర్పణ కూడా అయింది. ఒక్కరికి కూడా శాంతి లేదు.
మరునాడు 2 గం.లకు మొదలయిన కుంభవృష్టి 36 గం.లు కురిసి చుట్టుప్రక్కల గ్రామాలను కూడా ముంచెత్తి మురిపించింది.
ఏపనికయినా నమ్మకం, శ్రద్ధ ముఖ్యం. సంకల్పం మంచిదయితే సత్ఫలితం తప్పకుండా ఉంటుంది. మంత్రం శ్రద్ధగా జపిస్తే చింతకాయలేమిటి ఏమయినా రాలుతాయి.
" తన్మే మనః శివసంకల్పమస్తు " - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment