సౌభాగ్యభాస్కరం

 🙏"శ్రీమాత్రేనమః"🙏

శ్రీలలితాసహస్రనామాలకు భాష్యం వ్రాసిన భాస్కరరాయలవారు దానికి " సౌభాగ్యభాస్కరం " అని పేరుపెట్టారు. అమ్మవారికి అష్టోత్తరం చేసినప్పుడు " సౌభాగ్యదాయైనమః " అని ప్రార్ధిస్తాం. ఎంత చక్కటి పేరు.

ఈయన మరాఠారాజ్యంలో నివశించేవారు. రాజుకు పిల్లల్లేరు. ఈయనవద్దకు వచ్చి విషయం చెప్పి బాధపడ్డారు. ఈయన అమ్మవారి నామం ఒకటి చెప్పి శ్రద్ధగా పారాయణ చెయ్యండి అన్నారు రాజుని రాణిని. వారుకూడా భక్తులు, శ్రద్ధగా పారాయణ చెయ్యడం మొదలుపెట్టారు.

రాణి గర్భవతి అయింది. రాజు మహదానందంతో భాస్కరరాయల వారిని కలిసి విషయం చెప్పారు. ఈయన " శుభం, చక్కటి కొడుకు పుడతాడు " అన్నారు.

రాజు తిరిగి వెడుతూంటే రాయలవారి శిష్యుడు కనిపించాడు. మానవనైజం కదా, రెండో అభిప్రాయం మంచిదనుకున్నాడేమో, రాజు శిష్యుడికి కూడా విషయం చెప్పి " కొడుకు పుడతాడా కూతురు పుడుతుందా " అని అడుగుతే శిష్యుడు " కూతురు " పుడుతుంది, వెళ్ళిరా అన్నాడు. రాయలవారి శిష్యులంటే వారుకూడా ఎంతటి మహాపండితులయి ఉంటారు.

సరే రాణికి " నపుంసకుడు " పుట్టాడు. రాజు ఏడుస్తూ వచ్చి పెద్దాయన కాళ్ళమీద పడి విషయం చెప్పాడు. ఆయనకు ఆశ్చర్యం వేసి పొరబాటు ఎక్కడ జరిగిందీ అని అంతర్దృష్టితో చూస్తే తను " కొడుకు " అన్నాక తన శిష్యుడు " కూతురు " అనడం తెలిసింది.

సరే పరవాలేదు, ఓ చక్కటి యాగం చేసి కొడుకుగా మారుద్దాం అన్నారు. యాగానికి సూర్యోదయానికి పూర్వమే నదీస్నానం ముఖ్యం. అక్కడ నదిలేదు. యాగం కొన్ని రోజులు జరుగుతుంది కనుక నదినే అప్పటిదాకా ఈ ఊరిమీదుగా వెళ్ళమందాం అని సంకల్పం చెయ్యగానే నది మహదానందంతో ఈ ఊరిమీదుగా వెళ్ళడం మొదలెట్టింది. మహానుభావులు భాస్కరరాయలవారు స్నానం చేస్తారు కనుక నదికి అంత ఆనందం.

యాగం అవడం, నపుంసకుడు పుత్రుడుగా అవడం, నది తన పూర్వపు స్థితికి వెళ్ళడం జరిగిపోయాయి చకచకా. ఇప్పటికీ నది ఇలా వచ్చి అలా వెళ్ళిన ఆనవాళ్ళు ఉన్నాయిట అక్కడ.

" అపర్ణాయైనమః " అని అమ్మవారి ఒక అద్భుతనామం. రుణం లేనిది, లేకుండా చేస్తుంది అని భాష్యం చెప్పారు. మనకు డబ్బులు రావలసి ఉంటే వెంటనే వచ్చేలా చేస్తుంది, మనం ఇవ్వవలసివస్తే వెంటనే చెల్లించే శక్తినిస్తుంది. భాస్కరరాయలవారు అన్నారు " అమ్మా, ఎప్పటినుంచో ఈ నీనామాన్ని జపం చేస్తున్నాను, అందరికీ రుణంలేకుండా చేసే నువ్వు నువ్వు రుణపడడమేమిటమ్మా. ఒక్కసారి నాకు దర్శనమిచ్చి నీ రుణంకూడా తీర్చేసుకోవచ్చు కదా " అని. ఎంత చక్కటి కోరిక. 

కారణజన్ములు. ఇలాంటివారిని ఒక్కసారి తలచుకున్నా ధన్యులమవుతాం. సంశయం నాస్తి.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ