వ్యాసర్షి 2
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
నేడు అక్షరతృతీయ.
ఈరోజే వ్యాసమహర్షి అద్భుతమయిన ఇతిహాసం " మహాభారతం " రచన ప్రారంభించారు అని చెబుతారు.. బ్రహ్మగారిని " భారతం నేను చెబుతూంటే వ్రాయడానికి ఎవరైతే బావుంటుందో చెప్పండి " అని అడుగుతే గణపతిని ప్రార్ధించమంటారు.
గణపతి ఒప్పుకుని ఒక్కక్షణమయినా నేను ఖాళీగా ఉండకుండేటట్లుగా చెప్పగలిగితే తప్పకుండా వ్రాస్తాను అన్నారు. అలాగే అన్నారు వ్యాసర్షి.
మహాభారతం అసలు పేరు " జయ సంహిత ". 100700 శ్లోకాలు, ఎన్నో సంవాదాలు, నీతికధలు, చిత్రవిచిత్ర సంఘటనలు చెబుతూంటే గణపతి వ్రాస్తున్నారు. కాని గణపతి వ్రాసే వేగానికి ఈయన చెప్పే వేగం సరిపోవట్లేదు. అందుకని అప్పుడప్పుడు " చ, తు " లు వాడడం మొదలెట్టారు వ్యాసర్షి. ఇక్కడ ఈ " చ కాని, తు కాని " ఎందుకు చెప్పారు అని గణపతి ఆలోచనలో పడేవారుట. ఆ విరామం సరిపోయేది వ్యాసర్షికి.
ఛందస్సుకోసం అక్షరం తక్కువయితే అర్ధం మారకుండా ఉండడానికి " చ, తు " వాడుతారు సాధారణంగా. చ అంటే మరియు, తు అంటే కాని. ఉదా: " రాముడు కృష్ణుడు వస్తున్నారు " ని " రాముడు మరియు కృష్ణుడు వస్తున్నారు " అని వ్రాస్తారు. " రాముడు వస్తున్నాడు, కృష్ణుడు రావటంలేదు " ని " రాముడు వస్తున్నాడు కాని కృష్ణుడు రావటంలేదు " అని వ్రాస్తారు అవసరమయితే ఛందస్సుకోసం.
కాళిదాసు మహాకవి ఓ సారి తోటిపండితులతో ఒక ఉద్యానవనంలో తిరుగుతున్నారు. పండితులు ఈయన కవిత్వాన్ని పొగుడుతూ ఈయన్ని " ములగచెట్టు " ఎక్కించేసారు. అక్కడ " వ్యాసమహాముని " విగ్రహం ఉంది. ఆయన్ని చూసి మిగతా పండితులు భారతంలో అన్ని " చ, తు " లు వాడేరేమిటండీ వ్యాసులవారు అనడం కాళిదాసు " అందుకే కదా ఈయన్ని చకారకుక్షి అన్నారు, ఈ పొట్టలో ఎన్ని చకారాలు ఉన్నాయో " అంటూ వ్యాసుల పొట్టమీద వ్రాసి బొడ్డులో వ్రేలుతో తిప్పారు. అంతే ఈయన వ్రేలు ఆ బొడ్డులో ఇరుక్కుపోయింది.
కాళిదాసు పండితులతో " మీ పొగడ్తలతో అహంకారం నా నెత్తికి ఎక్కిపోయి క్షమించరాని తప్పుచేసాను " అని బాధపడతారు.
పరిస్థితులు ఎంత పండితుడినయినా అవివేకిని చేసేస్తాయి. కాని అటువంటివారు తొందరగా బయటపడతారు.
అప్పుడు విగ్రహంలోని వ్యాసులు ఇలా అంటారు " నీ బాధ చూడలేకపోతున్నాను, పాండుతనయులు, భర్త, బావ, మరిది పదాలు వచ్చేలా ' చ ' లేకుండా ఓ శ్లోకం చెప్పు " అని అడుగుతారు.
మహానుభావుడు కనుక కాళిదాసు ఇలా అన్నారు :
" ద్రౌపత్యాః పాండుతనయాః, పతి
దేవర భావుకాః,
న దేవరో ధర్మరాజః, సహదేవో న
భావుకః ".
అంటే " ద్రౌపదికి పాండుతనయులు పతి, మరిది, బావలు. ధర్మరాజు మరిది కాలేడు. సహదేవుడు బావ కాలేడు " అని. " అద్భుతం " అంటూ వ్యాసులు ప్రత్యక్షమై " బావుంది కాని ఎదుటివారిపై చలోక్తులు మాని పాండిత్యంపై దృష్టి పెట్టు " అని ఆశీర్వదిస్తారు.
ఈ శ్లోకంలో " చ " లేదు. ద్రౌపది ధర్మరాజు ఇంట్లో ఉంటే మిగతా నలుగురు మరుదులవుతారు. మిగతా వారి ఇంట్లో ఉంటే ధర్మరాజు, అన్నలు బావలవుతారు. కాని ధర్మరాజు ఎప్పటికీ మరిది కాలేడు, సహదేవుడు బావ కాలేడు అంటూ అంతటి అద్భుత శ్లోకం చేప్పారు మహాకవి.
భగవద్గీత మానవజాతికి దక్కిన అద్భుతకానుక.
అక్షరతృతీయ శుభాకాంక్షలు.
ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment