గరిటెలు
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏
" ప్రవచనాలు బాగానే వింటున్నారు, దేవాలయాలకు బాగానే వెడుతున్నారు. అభిషేకాలూ అష్టోత్తరాలూ బాగానే చేయించుకుంటున్నారు. దానధర్మాలూ బాగానే చేస్తున్నారు. కాని మనుషుల్లో రావలసినంత మార్పు రాలేదనీ మంచితనం తగ్గిపోయిందనీ బాధపడుతూంటారు కొందరు.
నేరం మనుషులది కాదు " గరిటెలది ".
గరిటె వంటగదిలో ఉంటుంది. బిర్యానీ చేసినప్పుడు బాగా కలుపుతుంది, సాంబారుని కలుపుతుంది, బాదంఘీర్ ని పాయసాన్ని కలుపుతుంది, కారంపెట్టి వండిన కూరలని కలుపుతుంది, కొత్త ఆవకాయని బాగా కలుపుతుంది - విశేషమేమిటంటే అన్నింటిలోనూ అది పాలుపంచుకున్నా ఈ అద్భుత రుచులేవీ గరిటెకు అంటవు. ఇప్పుడు ఈ భక్తి విషయంలోనూ జరుగుతూన్నది అదే. ఏదో మొక్కుబడి అయిపోయి " గరిటె " లా మిగిలిపోతున్నాం.
ఓ ఉదాహరణ చూద్దాం. వైకుంఠఏకాదశి రోజున ఉత్తరద్వారం గుండా గుడిలోకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుంటే పుణ్యమంది శాస్త్రం. చూడకపోతే పాపమని ఎక్కడా చెప్పలేదు. దీన్ని అనుకూలంగా మలుచుకోవడానికి కొంత రుసుం పెడతారు గుడి అధికారులు. పరవాలేదు. గుడికి గుడిలోని దేవుడికి డబ్బు అవసరం లేకపోయినా " వేరే " అవసరాలకోసం అధికార్లు రకరకాల " మాయలు " చేస్తూంటారు. దానిలో ఒకటి ఏకాదశికి 10 రోజుల ముందర్నుంచీ పదిరోజుల తరువాత కూడా దర్శనాలు చేసుకోవచ్చు అంటారు. వాళ్ళ అవసరాలకోసం రకరకాలుగా చెబుతూంటారు. వెళ్ళేవారికి బుర్ర ఉండాలిగా. వైకుంఠఏకాదశి దర్శనాన్ని పాడ్యమి విదియ నాడో త్రయోదశి నాడో చేసుకోవడం ఏమిటి , పైగా అధికడబ్బులు ఇచ్చి మరీ అని కొంచెం ఆలోచన చెయ్యాలి.
కాని నేరం వారిదికాదు " గరిటెలది "
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment