భ.గీత 15:1
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" ఊర్ధ్వమూలమధః శాఖమశ్వత్థం
ప్రాహురవ్యయం, ఛందాంసి యస్య
పర్ణాని యస్తం వేద స వేదవిత్ "
- భ.గీత 15:1
అంటే " మూలం ( వ్రేళ్ళు ) పైకి కొమ్మలు క్రిందకు ఉన్న అశ్వత్థ ( రావి ) చెట్టు రహస్యాన్ని ఎవరు తెలుసుకుంటారో, దాని ఆకులను వేదమంత్రాలుగా ఎవరు తెలుసుకుంటారో వారు వేదజ్ఞానాన్ని పొందినవారవుతారు " అని.
ఇందులో అద్భుతమయిన తత్వం ఉంది.
" శ్వ " అంటే రేపు. " త్థ ( స్థ ) " అంటే ఉండేది. దీనికి " అ " చేర్చి అశ్వత్థ అంటే రేపు ఉండనిది. రేపు ఉండనిది అని ఏమిటి?. అంటే రేపు ఈరోజులా ఉండనిది అని.
మనుషుల్లో అయినా చెట్లలో అయినా క్షణం క్షణం మార్పు జరుగుతూ ఉంటుంది. కాని రావిచెట్టు 2500 ఏళ్ళు బ్రతుకుతుంది కనుక ఓ మనిషి తన జీవితకాలంలో దానిలో పెద్దగా మార్పుని చూడడు. " నేను " అనే దానిలో కూడా పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకూ మార్పు ఉండదు.
సంసారం అనే వృక్షం కూడా అలాంటిదే. ప్రతీ క్షణమూ మార్పు జరుగుతూన్నా ఏరోజూ మార్పు తెలియదు, ఒకేలా ఉన్నట్లు, గడిచిపోతూన్నట్లూ ఉంటుంది. తెలియకుండానే ముసలితనం వచ్చేస్తుంది.
ఎప్పుడయినా ఒంటరిగా ఉన్నప్పుడు జీవితంలో వెనక్కి వెళ్ళి బాల్యం, చదువు, ఉద్యోగం, వివాహం, పిల్లలు అంటూ ఆలోచనచేస్తే ఓ కలలా అనిపిస్తుంది. మహామాయ.
రావిచెట్టుకు వ్రేళ్ళు క్రింద భూమిలో ఉంటాయి. మన మూలాలు ఎక్కడున్నాయి - బ్రహ్మలో, పైన. అందుకే తిరగబడిన రావిచెట్టు అన్నారు. కొమ్మలు, చిగుర్లే సంతానం. చెట్టుకు ఆహారం/శక్తి/జ్ఞానం ఇచ్చేవి ఆకులు. మనకు వాటిని వేదాలు ఇస్తాయి. అంటే ఆ ఆకులే వేదాలు. రావిచెట్టు స్వరూపాన్ని, దాని ఆకులను వేదాలుగానూ అర్ధంచేసుకున్నవాడు జ్ఞాని. తన మూలం బ్రహ్మ అని తెలుకున్నాడు కనుక.
" అశ్వత్థః సర్వ వృక్షాణాం " అన్నారు పరమాత్మ గీతలో - భ.గీత 10:26. " వృక్షాలలో రావిచెట్టు ని " అని.
రావిచెట్టుకు ఇంత విలువ ఇవ్వడానికి కారణం ఏమిటి. " నేను " లాగ ఏమీ తేడా లేకుండా వందల ఏళ్ళు ఒకలాగే ఉంటుంది. అద్భుతంగా ప్రత్యేక జీవక్రియద్వారా ( CAM - Crassulacean Acid Metabolism ) రాత్రికూడా ప్రాణవాయువును ( Oxygen ) ఇస్తుంది.
రావిచెట్టుని ఆంగ్లంలో " పీపల్ " అంటారు. ఆశ్చర్యకరంగా ఇది సంస్కృతపదమే.
భవిష్య పురాణంలో ఒక కధ ఉంది. ఓ సమయంలో విపరీతమయిన కరువుకాటకాల వల్ల కౌశికుడు అనే ముని తన కుటుంబంతో వేరేచోటికి వలసపోతూంటే వారి ఒక కుమారుడు త్రప్పిపోతాడు. ఆ కుర్రాడు ఓ చెట్టుక్రింద ఉండి దాని పళ్ళనే తింటూ కాలం గడుపుతూంటాడు. నారదులవారు వచ్చి ఇతనికి " ఓం నమో భగవతే వాసుదేవాయ " అనే మంత్రాన్ని ఉపదేశించి " పిప్పలాదుడు " అని నామకరణం చేస్తాడు. ఎందుకంటే అతను పెరిగినది రావిచెట్టు క్రింద, తిన్నది పీపలఫలాలు కనుక, దానిపేరు కలిసేలా. " పీపల్ " అన్నది అక్కడనుంచి వచ్చింది.
మన సనాతనధర్మం విశిష్టతే అది. ప్రతీ విషయం వెనుక ఓ అద్భుత కారణం ఉంటుంది. దీనికి సాటి లేదు, రాదు. ప్రపంచభాషలకు మూలం మన వేదవాజ్మయం అని మనం అనలేదు. డేవిడ్ ఫ్రాలే అనే విదేశీ " వేదపండితుడు " అన్నారు.
ఏతత్ సర్వం శ్రీశ్రీకృష్ణార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment