ఉగాది
🙏 " శ్రీరస్తు శుభమస్తు " 🙏
నేడు ఉగాది. శోభకృత్ నామసంవత్సర ప్రారంభం. శోభకృత్ అంటే శోభను కలిగించేది అని అర్ధం.
అసలు చైత్రపాడ్యమినే ఉగాదిగా ఎందుకు జరుపుకోవాలో పూజ్యులు సామవేదంవారు ప్రవచనం చేస్తూ ఇలా తెలియచేసారు.
దిలీపచక్రవర్తి తన భార్య సులక్షణాదేవి తో కలిసి రధంపై " సంతానాన్ని పొందడానికి ఏమి చేయాలో " తెలుసుకోవడానికి వశిష్ఠాశ్రమానికి బయలుదేరారుట.
కాళిదాసు తన రఘువంశ కావ్యంలో ఈ ఘట్టాన్ని ఇలా వర్ణించారు " మంచుతొలగిన చైత్రపూర్ణిమనాడు చిత్ర నక్షత్రం చంద్రుడు కలిసిఉన్నట్లుగా ఉన్నారు రాణి రాజు " అని.
ఇక్కడ మంచుతెరలు తొలగిన అంటే బాధలు పోయే సమయం అని. ఎంత అద్భుతవర్ణన.
యజుర్వేదంలో ఇలా ఉంది:
" యజ్ఞపతిం వృషయేవ సాహుః, ప్రజానిర్భక్తా అనుతప్త్యమానా, మదభ్యౌస్తోతా2వపతౌ నరాధ "
దీని అర్ధం " అర్హత కలిగి శాస్త్రాలు తెలిసిన సోమయాజులు మధుమాసాలలో యజ్ఞాలు చెయ్యకపోతే కరువుకాటకాలు వస్తాయి " అని. ఎంత అద్భుత విషయం తెలియచేసారు మన ఋషులు.
యజ్ఞం చెయ్యడం ప్రకృతిలోని లోపాలను సరిచేయడానికి. కాలక్షేపానికి కాదు. సోమయాజులు " నాకు కుదరదు, ఖాళీలేదు, రాలేను " అని చెప్పకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి.
మరి ఈ " మధుమాసాలు " అంటే ఏమిటి.
వేదమాత మంత్రం లో ఇలా ఉంది:
" చిత్రా పౌర్ణమాసే దీక్షేరముఖంవా,
ఏతత్ సంవత్సరస్యాయ చిత్రా,
పౌర్ణమాసౌ ముఖస ఏవ,
సంవత్సరమారభ్య దీక్షంతే "
అంటే " సంవత్సరానికి ముఖం ( ముఖద్వారం ) అయిన చైత్రపౌర్ణమి నాడు దీక్ష ప్రారంభించాలి " అని.
అంటే సంవత్సరానికి చైత్రం మొదటి మాసం అని తెలుస్తూంది వేదముఖంగా.
అందుకే చైత్రపాడ్యమిని సంవత్సరం మొదటిరోజుగా " ఉగాది " గా జరుపుకుంటున్నాం వేల సంవత్సరాలుగా.
మన " సనాతనధర్మము " నకు సాటి లేదు, రాబోదు.
శోభకృత్ నామ సంవత్సరం అందరికీ శుభమే కలిగించేలా అనుగ్రహించమని " అవ్యాజకరుణామూర్తి " అమ్మవారిని వేడుకుందాం.
సర్వే జనాః సుఖినోభవంతు. సమస్త సన్మంగళాని సంతు. అందరికీ శుభకృత్ నామ నూతన తెలుగుసంవత్సరాది శుభాకాంక్షలు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment