సౌందర్యలహరి

 🙏 "శ్రీమాత్రేనమః"🙏

ఈరోజు శంకరాచార్యులు  అద్భుతమయిన " సౌందర్యలహరి " ని ప్రసాదించిన రోజు.

అంతటి అందమైన " సౌందర్యలహరి " అన్న పేరెలా కుదిరిందో ఈ శతకానికి. 

దీని పారాయణం వలన కలిగే ప్రయోజనాలు అనేకం అని పండితులు తెలియచేసారు.

జ్ఞానం కలిగితేనే మోక్షం కలుగుతుంది. అటువంటి జ్ఞానాన్ని కలిగిస్తుంది ఈ పారాయణ. మనిషి 3 తాపాలతో ( ఆధ్యాత్మికం, ఆధిభౌతికం, ఆధిదైవికం ) బాధపడుతూ ఉంటాడు, ఆ తాపాలను పోగొడుతుంది. దీన్ని వేదాంతం అనుకుంటారు కాని ఇది శాస్త్రీయం. అనేక రోగాలను ముఖ్యంగా మానసికరోగాలను పోగొడుతుంది. 

సౌందర్యలహరి అంటే అమ్మవారి వర్ణనే కదా అనుకుంటారు, కాని ప్రతీ శ్లోకంలోనూ అంతర్వాహినిగా అద్భుత మంత్రం ఉంటుంది. ప్రతీజీవిలోనూ చైతన్యం ( పరమాత్మ ) ఉంది కాని తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకని అంటే అంతఃకరణశుద్ధి లేక. దానిని కలిగిస్తుంది ఈ పారాయణ. 

ఉపనిషత్తుల సారమే ఇది. పఠించేవారి కష్టాలని మానసికవ్యధలనీ పోగొట్టడమే కాదు సమాజంలో సమైక్యత ప్రాముఖ్యం కూడా తెలియచేస్తూంది అని తెలియచేసారు.

ఈ శతకంలో " సౌందర్యలహరి " అనే పదం చాలాసార్లు వస్తుంది. లహరి అంటే అల, సౌందర్యలహరి అంటే " సొగసువెల్లువ " అని తెలుసుకోవాలి. 

అమ్మవారి సౌందర్యం అంత అద్భుతంగా ఉంటుంది. ఎంతగా అంటే ఓ శ్లోకం చూద్దాం.

" శరజ్జ్యోత్స్నా శుద్ధాం  శశియుతజటాజూట

  మకుటాం,  వరత్రాసత్రాణ స్ఫటికఘటికా  

  పుస్తకకరాం, సకృన్నత్వా న త్వాం కధమివ

  సతాం సన్నిదధతే, మధుక్షీర ద్రాక్ష  

  మధురిమ ధురీణాః ఫణితయః ".

శరత్కాలంలోని వెన్నెలలా శుద్ధమై చంద్రుడితో కూడిన జటామండలంతో నిండిన శిరముకలిగి వర అభయ ముద్రలు స్ఫటికమాల పుస్తకములతో కూడిన చేతులు ( 4 చేతుల అలంకారాలు ) కలిగిన నిన్ను ( నీరూపాన్ని ) ఒక్కసారైనా ధ్యానించుకోకపోతే సజ్జనులకైనా ( నోటివెంట ) తేనె పాలు ద్రాక్షల వలె మధురముగా ఉన్న మాటలెలా ( కవిత్వం ) వస్తాయమ్మా " అని.

ఈవిడ శారదాదేవి. వీణ ఉంటే సరస్వతీ దేవి. యోగులు కళాకారులకు దైవం శారదాదేవి. లౌకిక చదువులకు సరస్వతీదేవి అని తెలుసుకోవాలి.

సజ్జనులకే, ఆవిడ అనుగ్రహం లేకపోతే, నోటివెంట మంచిమాటలు రావు. మరి మిగతావారిమాట చెప్పాలా అని ఆయన భావన.

ఈ శ్లోకం ఒకసారి చదివి అమ్మవారి రూపాన్ని తలచుకుంటే నోటివెంట మంచిమాటలే వస్తాయి, అంతా శుభమే జరుగుతుంది. సంశయం నాస్తి. 

ఈ పవిత్రమయిన " సౌందర్యలహరి " ఆవిర్భవించిన రోజున అమ్మవారిని ఎల్లప్పుడూ " అందరినీ చల్లగా చూడమని " కోరుకుందాం - సూర్య. 

శుభం భూయాత్ 









Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ