ఉపనయనం

 శ్రీరస్తు శుభమస్తు

" మనిషన్నాక కాస్తంత కళాపోషణ ఉండాలయ్యా, ఉత్తినే తినితొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏటుంటది " - ముత్యాలముగ్గు సినీమాలో రావుగోపాలరావు.

మాగ్రామానికి 15కిమీల దూరంలో ఓ గ్రామం ఉంది. అక్కడ నడిమింటి సర్వమంగళశాస్త్రి గారని ఓ పండితుడు ఉండేవారు. మా బంధువే ఆయన. వారి అబ్బాయికి ఉపనయనం చేస్తూ ఆహ్వానపత్రికలో " మా అబ్బాయి ఉపనయనానికి మీరందరూ విచ్చేసి వటువుని ఆశీర్వదించి భోజనం చేసి వెళ్ళవలెను. భోజనాల తరువాత నా ఉపనయన కార్యక్రమాన్ని కూడా వీక్షించి వెళ్ళవలసినదిగా కోరుకుంటున్నాను " అని వ్రాసారు. అందరికీ ఆశ్చర్యం వేసింది. అబ్బాయికి ఒడుగు ఓకె, ఈయనకు మళ్ళీ ఈవయస్సులో ఒడుగు ఏమిటీ అని.

సరే ఈ విషయం చూడాలనే మొత్తం బంధువులందరూ వచ్చేసారు. భోజనాలయాయి. శాస్త్రిగారు కుర్చీలో కూర్చున్నారు, బంధువులు అతిధులు ఎదర చాపలమీద ఆశీనులయారు

శాస్త్రిగారి భార్య ఓ చిన్న అందమైన పెట్టె తెచ్చి శాస్త్రిగారికి ఇచ్చారు. ఆయన ఆ పెట్టె మెల్లిగా తెరచి అందులోనుంచి ఓ కళ్ళజోడు తీసారు.

అందరికీ చూపెట్టి " నాకు చత్వారం వచ్చింది ఈమధ్యనే, ఈ కళ్ళజోడు పెట్టుకోమన్నారు. ఈరోజు ముహూర్తం బాగుందని పెట్టుకుంటున్నాను. మీరందరూ నా ఉపనయనం ( నయనం అంటే కన్ను, ఉప అంటే దగ్గరగా - అంటే కళ్ళజోడు ) కార్యక్రమం కూడా చూసి వెడుతూన్నందుకు ధన్యవాదాలు " అని అది పెట్టుకున్నారు.

లేచామా, తిన్నామా, పడుకున్నామా అనికాకుండా ప్రతీ పనిలోని హాస్యాన్ని అనుభవించాలి. అప్పుడే మనస్సు తేలికపడి ఆరోగ్యం బావుంటుంది - సూర్య. 

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ