శ్రీసూక్తం

🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

" విశ్వప్రియే 

      విష్ణు మనో2నుకూలే 

  తత్పాదపద్మం 

      మయి సన్నిధత్స్వ " 

                     -  శ్రీసూక్తం.

" నీ పాదపద్మమును నాపై ఉంచి కటాక్షించు " అని ప్రార్ధిస్తాం అమ్మవారిని. 

మూకకవి/మూకశంకరులు కంచికామాక్షీ అమ్మవారి దర్శనకటాక్షంతో ఆసువుగా 500 శ్లోకాలతో అమ్మవారిని ప్రార్ధన చేసారు. అది " మూకపంచశతి " గా ప్రసిద్ధిచెందింది. అమ్మవారి ఒక్క పాదపద్మాలనే 100 శ్లోకాలతో స్తుతించారు. 

ఇలా పాదాలను ఆశ్రయించడం/స్తుతించడం ఏమిటీ అని చాలామందికి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. 

భగవద్గీత గురించి ప్రవచనం చేస్తూ ఒక పండితులు దీని గురించి ఒక అద్భుతమయిన విషయం తెలియచేసారు.

" వలలో పడ్డాడు పాపం " అంటూంటారు ఎవరయినా మాయకు/మోసానికి లోనయితే. అమ్మవారు జీవులందరూ ఉత్తీర్ణులవాలని అన్ని అవకాసాలనూ కలిగిస్తుంది కాని ఆవిడపెట్టే పరీక్షలు కొంచెం కఠినంగానే ఉంటాయి. 

ఎల్కెజీలో చేరడానికే ఎన్నో పరీక్షలు పెడుతూంటే ముక్తి/మోక్షం పొందడానికి ఎన్ని పరీక్షలు ఎదుర్కోవాలి జీవుడు.

ఒక చేపలు పట్టేవాడు నదికి వెడతాడు. 5/6 అడుగులు నీటిలోపలికి వెళ్ళి పెద్ద వలని విసురుతాడు. మెల్లిగా వలను తనవేపు లాగుతాడు. చేపలు వలలో చిక్కుకుని అతని బుట్టలోకి చేరుతాయి. కొన్నిచేపలు అతని పాదాల దగ్గర తిరుగుతూంటాయి. వాటికి " వల " వల్ల భయమూ, ప్రమాదమూ రెండూ ఉండవు. వల అతని పాదాలవరకూ రాదు కనుక.

అలాగే అమ్మవారి పాదాలదగ్గర ఉన్నవారికి ఆవిడ పరీక్షించడానికి విసిరే " వల ( మాయ ) " వల్ల భయమేమి ఉంటుంది?. అందుకే అమ్మవారిపాదాలు నమ్ముకున్నవారికి ఏ భయాలు ఉండవని శాస్త్రాలు తెలియచేస్తున్నాయి.

" మనశ్చేన్న లగ్నం  

         గురోరంఘ్రిపద్మే, 

  తతఃకిం,తతఃకిం 

         తతఃకిం తతఃకిం " 

- " ఎన్ని ఉన్నా గురువుగారి పాదపద్మాలమీద మనస్సు లగ్నం కానప్పుడు ఉపయోగమేమిటి " అన్నారు ఆదిశంకరులు. అమ్మవారు గురురూపిణి. అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.

ఈరోజు పవిత్రమయిన అధిక " శ్రావణపూర్ణిమ ". మంగళప్రదమయిన మంగళవారం.

సుఖమయ జీవితానికి అందరం అమ్మపాదాలని ఆశ్రయిద్దాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ