శ్రీలలితానామం77
🌺🙏"శ్రీమాత్రేనమః"🙏🌺
" కామేశ్వరముఖాలోక కల్పితగణేశ్వరా " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 77వ నామం.
అమ్మవారు( కామేశ్వరి ) కామేశ్వరుడు ముఖంలోకి చూడగానే స్వామి విఘ్నేశ్వరుడిని అనుగ్రహించారు అని. అమ్మవారు ఓరకంటితో చూసిందిట. ఆవిడ చిరునవ్వు ఎలా ఉందంటే పలువరసలు కూడా కనిపించనంత చిన్ననవ్వు. స్వామి ముగ్ధుడు అవకుండా ఎలా ఉండగలరు.
అమ్మవారు భండాసురుడితో యుద్ధం చేస్తున్నారు. అతను విఘ్నాస్త్రాన్ని ప్రయోగించాడు. అన్నీ విఘ్నాలే. తొలగించాలంటే విఘ్నాలకు ప్రభువైన విఘ్నేశ్వరుడు రావాలి, పైగా వెంటనే. అందుకని భర్త కామేశ్వరుడివైపు అలా చూసిందిట. ఎంత అద్భుతమైన విషయం.
పార్వతీదేవి నలుగుపిండితో బొమ్మచేసి ప్రాణం పొయ్యడం, శివుడు ఆ బాలుడి తల ఖండించడం, గజాననుడి తలపెట్టడం తెలుసు మనకు. మరి ఈ విఘ్నేశ్వరుడు ఎవరు, అసలు విఘ్నేశ్వరుడు ఎప్పటివారో చూద్దాం.
పరమాత్మ వ్యాసర్షితో " కలియుగం వచ్చేస్తూంది, జీవులు చాలా కష్టాలు పడతారు, సులువుగా మనశ్శాంతిని పొందడానికి, వేదాలను ఓ క్రమపద్ధతిలో పెట్టు " అనడంతో వ్యాసర్షి వేదవిభజనకు, 18 పురాణాలు, 18 ఉపపురాణాల రచనకు శ్రీకారం చుట్టారు. కాని ఎక్కడ, ఒక్క వాక్యంకాదుకదా ఒక్క అక్షరం కూడా ఎదరకు వెళ్ళటం లేదు. ఆశ్చర్యపోయి బ్రహ్మను ధ్యానం చేసారు. ఆయన దర్శనం పొంది విషయం చెబితే బ్రహ్మ అన్నారు " పరమేశ్వరుడు నన్ను సృష్టి మొదలుపెట్టమన్నారు. ఏమి చెయ్యాలి, ఎలా ఎదరకు వెళ్ళాలి ఏమీ అర్ధమవలేదు. అప్పుడు విఘ్నేశ్వరుడిని ధ్యానం చేస్తే ఆయన దర్శనం ఇచ్చారు. ఆయన ఎలా ఉన్నారంటే :
" వక్రతుండ మహాకాయ
కోటిసూర్యసమప్రభా "
ఆయన దర్శనంతోటే నా మాయ నశించడం, సృష్టికార్యం నిర్విఘ్నంగా కొనసాగడం జరిగింది " అని తెలియచేయడం వ్యాసర్షి కూడా విఘ్నేశ్వర ధ్యానం చెయ్యడం అద్భుతమైన జ్ఞానసంపదని మనకు ఇవ్వడం జరిగింది. మహాభారతం స్వయంగా గణపతి వ్రాసారు వ్యాసర్షి చెబుతూంటే. అవ్యాజకరుణామూర్తి.
ఆయన అనాది. ఎంత పూర్వీకుడంటే శివపార్వతులకళ్యాణం కూడా గణపతిపూజతో మొదలయ్యింది. వినాయకచవితి నాడు చింతామణి, సిద్ధి, లక్ష్మీ,, పుష్టి అంటూ రకరకాల గణపతులను పెట్టుకున్నా ముందర " హరిద్రాగణపతి ( పసుపు గణపతి )కి పూజచేస్తారు. ఎన్నో రూపాలు. ముఖ్యంగా 32 రూపాలలో అనుగ్రహిస్తారు. ఆయన భక్తులకు ఇవ్వలేనిది లేదు.
ఈరోజు వినాయకచవితి. అత్యంత శుభప్రదమైన రోజు. అందరికీ సుఖసంతోషాలు ప్రసాదించమని స్వామిని వేడుకుందాం.
వినాయకచవితి శుభాకాంక్షలు.
ఏతత్ సర్వం శ్రీగణేశ్వరార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment