శ్రీలలితానామం909
🙏"శ్రీమాత్రేనమః"🙏
" సామగానప్రియా " - అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 909 వ నామం.
" సామ " అంటే మనస్సుకు శాంతి. కీర్తనలు/పాటలు మనస్సుకు శాంతి కలిగిస్తాయి. అమ్మవారు కీర్తనలను, వాటిని గానం చేసేవారిని ఇష్టపడుతుంది.
శివుడిని కూడా " సామగానప్రియాయనమః " అని పూజిస్తాం అష్టోత్తరశతనామాలపూజలో.
గౌరీఅష్టోత్తరశతనామావళిలో రెండు నామాలు అద్భుతంగా అనిపిస్తాయి. అవి " గద్యపాద్యాదికారణాయైనమః, పదవాక్యార్ధనిలయాయైనమః " అన్నవి. గద్యం పద్యం లకు కారణం అమ్మవారు. పదం వాక్యంల అర్ధాలలో కొలువై ఉంటుంది అమ్మవారు. అందుకే వాటి సాహిత్యం అంత అద్భుతంగా ఉంటుంది. మరి సినీమాపాటల, లలితగీతాల సాహిత్యమే అద్భుతంగా అనిపిస్తే అమ్మవారిని కీర్తిస్తూ చేసే కీర్తనలలోని సాహిత్యం ఎంత అద్భుతంగా ఉంటుంది.
ముత్తుస్వామిదీక్షితులుగారు అమ్మవారి ఉపాసకులు. అమ్మవారి రూపం, స్వభావం పూర్తిగా తెలిసినవారు. వాటిని దృష్టిలో పెట్టుకుని సాహిత్యం, దానికితగ్గ రాగంలో అద్భుతమయిన కీర్తనలు చేసారు.
అందరూ ఎంతో తరచుగా వినే " వాతాపి గణపతిం భజే " కీర్తన దీక్షితార్ విరచితమే.
ఆయన చేసిన నవగ్రహకీర్తనలు, గణేశస్తుతులు, కామాక్షీ మీనాక్షీ అమ్మవార్ల కీర్తనలు అన్నీ అద్భుతమే అయినా అమ్మవారు కొలువై ఉండే శ్రీచక్రంలోని నవావరణలలోని దేవతలను వర్ణిస్తూ, కీర్తిస్తూ చేసిన " నవావరణకీర్తనలు " అత్యద్భుతం.
సాధారణంగా ఏకీర్తనయినా ఆనందం, కాలక్షేపంకోసం. కాని దీక్షితులు గారు తన కీర్తనలలో దేవతా రహస్యాలను, ఉపాసనా మర్మాలను చేర్చి ఒక్కో కీర్తనను ఒక మంత్రంలా ఇచ్చారు. " తత్వచింతన " ను చేర్చి ఈ కీర్తనలద్వారా అమ్మవారి అనుగ్రహంని, ముక్తిని పొందవచ్చని నిరూపించారు.
ఇవి కమలాంబా, శ్రీపురకమలాంబా నవావరణకీర్తనలుగా ప్రసిద్ధిచెందాయి. నీలోత్పలాంబా, మంగళాంబా, అభయాంబా నవావరణకీర్తనలు కూడా చేసారు దీక్షితులు గారు.
శ్రీపురం అంటే తిరువారూరు, వాగ్గేయత్రిమూర్తులు దీక్షితులు, శ్యామశాస్త్రి, త్యాగయ్యలు పుట్టిన ఊరు. కమలాంబ ఆ ఊరి అమ్మవారిపేరు. శ్రీచక్రంలోని అంశాలమీద, ఆవరణలలోని దేవతల స్వరూపం స్వభావం మీద ఎంతో అవగాహన, అమ్మవారి అనుగ్రహం లేకపోతే ఈ కీర్తనలు చేయడం సాధ్యం కాదు. తాదాత్మ్యం చెందుతూ, ఆత్మసమర్పణ చేసుకుంటూ చేసిన కీర్తనలు ఇవి. ఎంతో ఉత్తమమైన సంగీతజ్ఞానం ఉన్నవారే ఈ కీర్తనలు గానం చేయగలరు.
నవావరణలు (9) అని అన్నా ఆయన 11 కీర్తనలు చేసారు. మొదటిది ధ్యానకీర్తన, 11వది మంగళకీర్తన. మధ్యలో 9 కీర్తనలు ఎంత అద్భుత ప్రక్రియతో చేసారంటే 1వది ప్రధమావిభక్తిలో చేసారు. 2వది ద్వితీయ, 3వది తృతీయ అలా 8వది సంభోదనావిభక్తి లో చేసి 9వ కీర్తనలో ఈ 8 విభక్తులూ వచ్చేలా కీర్తన చేసారు. ఎంతటి అద్భుతం, విద్వత్తు.
మహాకవి కాళిదాసు, పోతనామాత్యుడు కూడా " అమ్మా, నీ అనుగ్రహం లేకపోతే ఏమి వ్రాయగలమమ్మా " అని ప్రార్ధించేవారుట.
విద్వత్తు ఇచ్చేదీ ఆవిడే, కీర్తనలు చేయించుకునేదీ ఆవిడే, విని ఆనందించేదీ ఆవిడే.
ఈరోజు ఆఖరి "శ్రావణశుక్రవారం". పరమపవిత్రమయిన రోజు.
" సామగానప్రియ " ను అందరినీ అనుగ్రహించి చల్లగా చూడమని కోరుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment