అమ్మవారు తన కళ్ళను అటూ ఇటూ త్రిప్పుతూ అందరినీ గమనిస్తూ ఉంటారు - చీమలపాటి సూర్యనారాయణ

 " శ్రీమాత్రేనమః " 23+23


" దరాందోళితదీర్ఘాక్షీ " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 601వ నామం.

" దరాందోళిత దీర్ఘాక్షీ " అంటే కొద్దిగా అటుఇటు కదులుతూన్న పెద్దకనులున్నది అని భాష్యం చెప్పారు. అమ్మవారు తన పెద్ద పెద్ద కళ్ళను అటూఇటూ కదుపుతూంటేనేకదా సృష్టిలో ఎక్కడెక్కడో ఉన్న జీవులన్నిటినీ గమనిస్తూ అనుగ్రహించగలుగుతారు.

శంకరాచార్యులు " సౌందర్యలహరి " గానం చేస్తూ ఇలా అంటారు.

" దృశా ద్రాఘీయస్యా దరదళిత
       నీలోత్పలరుచా,
   దనీయాంసం దీనం స్నపయకృపయా
‌ ‌‌      మామపి శివే,
   అనేనా అయం ధన్యో భవతి న చ
       తేహానిరియతే,
   వనేవా హర్మ్యేవా సమకరనిపాతో
       హిమకరః " - శ్లోకం 57

" అమ్మా నేనెక్కడో దూరంగా చివరలో ఉంటాను ( యోగులు ఆవిడకు దగ్గరగా ముందు వరుసలో ఉంటారని, అయోగ్యులు ఎక్కడో వెనుకవరుసలో ఉంటారని భావం ), నీ కన్నులు చాలాపెద్దవి కనుక నీ చూపుని నామీద కూడా పడేలా చూడమ్మా. యోగులనే చూస్తాను, అనుగ్రహిస్తాను అని అనకమ్మా ఎందుకంటే చంద్రకాంతి మేడలమీద అడవిలోనూ సమంగానే ప్రసరిస్తుంది కదమ్మా ". ఈ అయోగ్యుణ్ణి అనుగ్రహించడం వల్ల నీకు వచ్చే నష్టమేమీ ఉండదు కాని ఈ అయోగ్యుడికి ఎంతో లాభమమ్మా " అని అంటారు శంకరులు. అంతటి మహానుభావుడు శంకరులు తనని తాను అయోగ్యుణ్ణని చెప్పుకుంటూ శరణాగతి కోరుతారు అమ్మవారిని. ఎంత అద్భుతమైన ఆత్మసమర్పణ.

ఇంకా అద్భుతమైన విషయం ఏమిటంటే ఈయన మాటలు విన్న అమ్మవారు " దరహాసోజ్వలన్ముఖీ " అంటే చిరునవ్వుతో మెరిసిపోతూన్న ముఖము కలిగినది " అయిందిట. అంతటి మహాపురుషుడు తనని తాను అయోగ్యుడుగా చెప్పుకోవడంతో ఆవిడకు చిరునవ్వు వచ్చిందని భావం. ఎంత అద్భుతమైన భాష్యం.

శంకరులు తమ " లలితా పంచరత్న స్తోత్రం " లో అమ్మవారిని " ఆకర్ణదీర్ఘనయనం " అంటే " చెవులవరకూ ఉన్న పొడవైన కనులు గలది " అని వర్ణిస్తారు.

అమ్మవారి ప్రియభక్తులు, కారణజన్ములు.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య

శుభం భూయాత్

Comments

Post a Comment

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ