శ్రీలలితానామం 754 - సూర్య
🙏"శ్రీమాత్రేనమః"🙏
" అపర్ణా " అమ్మవారి అద్భుతనామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 754 వ నామం.
" అపర్ణా "' అంటే సాధారణంగా ఆకులుకూడా ముట్టనిది అని చెబుతూంటారు. పార్వతిదేవి పరమేశ్వరుడిని వివాహం చేసుకోవడానికి ఘోరతపస్సు చేస్తుంది. " ఆకులు అలములు " తిని బ్రతుకుతున్నామంటూంటారు. ఆవిడ ఆకులు కూడా తినకుండా తపస్సు చెయ్యడం వల్ల " అపర్ణ " అని పిలవబడిందిట.
మరి అంతకు ముందే " సనాతన/పురాతన " అయిన అమ్మవారి ఒకనామం " అపర్ణ " కదా. అందుకని ఈ నామానికి అర్ధం " ఋణం లేనిది/ఋణం తీర్చునది " అని భాష్యం చెప్పారు.
" అపగత ఋణాయస్యా ........" - ఋణములు పోగొట్టే తల్లి అని భాష్యం చెబుతూ " శ్రీభాస్కరరాయులు " వారు అమ్మవారిని అద్భుతంగా ఓ కోరిక కోరారు. " అమ్మా రోజూ నిన్ను, నీ నామాలు స్మరించుకుంటూ పూజలు చేస్తున్నాను. అందరి ఋణాలు తీర్చే నువ్వు ఋణపడకూడదు కదా. నాకు నీ దర్శనభాగ్యం కలిగించి నీ ఋణం తీర్చేసుకోవచ్చుకదా. లేకపోతే నువ్వు అపర్ణవు ఎలా అవుతావు " అని. ఎంతటి చక్కటి కోరిక.
ఇక్కడ ఓ చక్కటి సందేహం వచ్చిందిట. ఋణం తీసుకున్నవాడు ఋణం ఇచ్చినవాడు ఇద్దరు ఉంటారుకదా, మరి ఇచ్చినవాడు ఏమి చెయ్యాలి అని. అతను కూడా " శ్రీఅపర్ణాయైనమః " అని జపం చేస్తే తొందరగా తను అనుకున్నట్లుగా అతని ధనం తిరిగి వస్తుందని తెలుసుకోవాలి.
పిల్లలకి దేవతల పేర్లు ఎందుకు పెట్టుకుంటాం అంటే రోజుకు 4 సార్లు ఆ నామం తలుచుకుంటామని. ఓ భ్రష్టుడు ఉండేవాడు. వాడి అదృష్టంకొద్దీ రెండో భార్య కొడుకుకి " నారాయణ " అని పేరు. పెట్టుకున్నాడు. చనిపోయే సమయం ముందర ఏదో అవసరం వచ్చి కొడుకుని " నారాయణ " అని పిలుస్తూ చనిపోయాడు. పరమపాపి కనుక యమభటులు వచ్చేసారు. అదే సమయానికి విష్ణుభటులు వచ్చారు విమానంతో. యమభటులు ఆశ్చర్యపోయి " వీడు మహాపాపి, మీరు వచ్చారేమిటి " అని అడుగుతే " చనిపోయేముందు ఇతను అన్న నారాయణ అనే ఒకేఒక్క నామం ఇతని పాపాలన్నిటింటినీ భస్మం చేసేసింది " అని చెప్పి అతన్ని వైకుంఠానికి తీసుకుపోయారు.
" అపర్ణా, లలితా " లాంటి పేర్లు పెట్టుకుంటారు చాలామంది తమ పిల్లలకు కాని అమ్మవారి అనుగ్రహం పొందడం అంత తేలిక కాదు, మాయ కమ్మేస్తుంది. " అప్పు, అప్పి, అప్ప, లల్లూ " అని పిలుచుకుంటారు కాని పూర్తిపేర్లు సాధారణంగా నోటినుండి రావు, అమ్మ అనుగ్రహం ఉంటే తప్ప.
పిల్లలని ఇటుపైన పూర్తి పేర్లతో పిలుచుకుందాం.
ఈరోజు అట్లతద్ది పండుగ. శుభాకాంక్షలు.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య
శుభం భూయాత్
నిజమే, పేర్లు అన్నీ షార్ట్ కట్ అయిపోయాయి.
ReplyDelete