" రాచకం - అరాచకం " సూర్య

 " రాచకం - అరాచకం " - సూర్య


1970/80 లలో ఓ చక్కటి కధ చదవడం జరిగింది. దేముడు " ఓరి మనిషీ, ఎంత ఎదిగావురా " అనుకుంటాడు కధలో. కొన్ని కధలు అలా గుర్తుండిపోతాయి. కధ అదే అయినా కధనం కొద్దిగా మార్చడం జరిగింది.

తిరుపతి వెంకన్న భక్తుల దర్శనాలు, సేవలు అన్నీ అయిపోయాక దేవేరులతో ముచ్చట్లాడుతున్నారు ఓ రోజురాత్రి. శ్రీదేవమ్మ కొంచెం నిష్ఠూరంగా " పాపం అతను మీ వీరభక్తుడు కదా, ఇప్పుడు వచ్చిన సునామీకి తిండికూడా లేక అల్లల్లాడుతున్నాడు, కొంచెం సహాయం చేయవచ్చుకదా " అంటుంది.

వెంకన్న " నాకూ ఏదో ఒకటి చెయ్యాలనే ఉంది. కానీ నా చేతులు కట్టేసాడు ఈ మనిషి. చూడు ఇప్పుడు ఏమి జరుగుతుందో " అని భక్తుడికి " ఫలానా అధికారిని కలు " అని కలలో చెబుతాడు. దేముడు చెప్పాడు బావుండదని ఆ అధికారిని కలుస్తాడు. వీడినుంచి రూపాయికూడా రాదు అని గ్రహించి ఆ అధికారి " నీకు 50 ఏళ్ళు, 60 దాటినా వృద్ధాప్యం పెన్షన్ ఇచ్చేవాడిని " అని తిప్పి పంపించేస్తాడు. ఇంకో అధికారిని కలుస్తాడు దేముడి సలహాతో. " నీకు 35 దాటిపోయాయి, నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేకపోతున్నాను " అంటాడు ఇంకో అధికారి. ఇంకో అతను " నువ్వు మగవాడివి అయిపోయావు, లేకపోతే పసుపుకుంకుమో, అమ్మవొడో ఇచ్చేవాడిని " అని పంపించేస్తాడు.

దేవేరులు ఆశ్చర్యపోతారు‌ "'మీరు ఇవ్వాలనుకున్నా పరిస్థితులు ఇంత భయంకరమయి పోయాయా భూలోకంలో " అని.

స్వామి అంటారు ఇప్పుడు అసలు వింత చూడండి అని " నా భక్తుడికి ఏ సహాయం చేయలేని నేను బ్రతికి ఉండడం వేష్టు, వెంటనే ఒక భయంకరమయిన పిడుగు నామీద పడి నేను మరణించాలి " అని అనగానే వెంటనే ఓ పెద్ద పిడుగు పడిన శబ్దం వినబడింది. కాని స్వామికి ఏమీ అవలేదు. దేవేరులు ఆశ్చర్యపోతే స్వామి అంటారు " పిడుగుపడినా నాకు, గుడికి ఏమీ అవకూడదన్నట్లుగా ఏర్పాటు చేసేసాడు మనిషి. ఇప్పుడు నా మరణం కూడా నా చేతుల్లో లేదు " అని. " ఓరి మనిషీ ఎంత ఎదిగిపోయావు " అని దేవేరులు ముక్కులమీద వ్రేలు వేసుకుంటారు.

ఇది ఇప్పుడు ఎందుకు జ్ఞాపకానికి వచ్చిందంటే ఎవరెవరు శక్తికిమించి కష్టపడుతూ దేశసంపదను, దేశప్రతిష్టను పెంచుతున్నారో ఎవరెవరు అరాచకాలు చేస్తూ వేలకోట్ల ప్రజాధనాన్ని, దేశసంపదను దోచేస్తున్నారో హైకోర్టు న్యాయమూర్తులకు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు, దేశాధ్యక్షులకు కూడా తెలుసు కాని " ఇప్పుడు ఏదీ వారిచేతులలో లేదు, వారు నిస్సహాయులు, అన్నీ అరాచకవాదులు వారి చేతుల్లోకి లాగేసుకున్నారు " అని ఎవరికయినా అనిపిస్తే నేరం అలా అనుకున్నవారిది కాదు అని భావించవచ్చు. తప్పులేదు.

కధలో దేముడు, దేవేరులు ఆశ్చర్యపోతే ఇప్పుడు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అదే తేడా.

రాచకం - అరాచకం.

విష్ణుమాయ. కలికాలం - సూర్య.

శుభం భూయాత్ 

Comments

Post a Comment

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ