రామాయణం - ఇతిహాసం - సూర్య
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
రామాయణం ఎంతటి అద్భుత కావ్యం. అందుకే ఇన్ని వేల ఏళ్ళు అయినా నిత్యనూతనంగానే ఉంది.
రాముడు అరణ్యవాసానికి వెళ్ళాక భరతుడు ఆయన్ని ఎలాగైనా ఒప్పించి వెనక్కు తీసుకురావడానికి మందీమార్బలంతో వెడతాడు. దారిలో భరధ్వాజమహర్షి ఆశ్రమానికి వెడతాడు సైన్యాన్ని దూరంగా ఉంచి.
మహర్షి " మీకు అతిధిసత్కారాలు ఏర్పాటుచేస్తాను ఉండు " అంటారు. భరతుడు " మీకు శ్రమవద్దు, పళ్ళూ అవీ తిని కాలక్షేపం చేస్తాము " అని అంటాడు. అప్పుడు మహర్షి అంటారు " నువ్వు రాజువి, అలా చేయవచ్చు కాని నీక్రింద పనిచేస్తున్నవారిని సౌకర్యవంతంగా చూసుకోవాలి. వారికి అవసరమయిన/ఇష్టమయిన తిండి, వసతి చూడ్డం నీ బాధ్యత " అంటారు.
వారి ఏర్పాట్లకోసం హోమం ముందు కూర్చుని దేవతలను ఆవాహన చేస్తారు పనులకోసం. విశ్వకర్మని ఇంద్రాది దిక్పాలకులను సోముడిని, కుబేరుడిని నదులను ఆహ్వానిస్తారు. అందరూ వచ్చి భవనాలను రుచికరమైన వంటలు ఏర్పాటుచేస్తారు.
ఇక్కడ వింత విషయమేమిటంటే " సోముడు " రకరకాల రుచికరమైన " మాంసపు వంటకాలు " ఏర్పాటు చేస్తాడు అతిధులకోసం.
మహర్షులు తాము తినేది పళ్ళూ, కందమూలాలయినా అతిథులకు వారికి ఇష్టమయినవి కష్టపడైనా సమకూర్చేవారు. " అతిథి దేవోభవ " అంది మన సనాతనధర్మం.
తాత్కాలిక వసతుల ఏర్పాటు, బయటివారిచేత భోజన సదుపాయాలు చేయించడం వేల సంవత్సరాల క్రితమే ఉన్నట్లుగా రామాయణం తెలియచేస్తూంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే ప్రక్రియ. ఎంత అద్భుతం మన సంస్కృతి.
ఏతత్ సర్వం శ్రీశ్రీరామార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
మనం పలహారమైనా, అతిథులకి గుప్పెడు బియ్యం వార్చి, అరటికాయ వేయించి, చారు పెట్టేవారుట.
ReplyDeleteనిజమేనండి
ReplyDelete