భగవద్గీత 11:53 - సూర్య
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" నాహం వేదైః నతపసా
నదానేన నచేజ్యయా,
శక్యా ఏవంవిధో ద్రష్టుం
దృష్టవాన్ అసి మాంయధా "
- భ.గీత 11:53
గీతలో పరమాత్మ అంటారు " వేదాలు చదవడం తపస్సుచెయ్యడం దానంచెయ్యడం పూజలుచెయ్యడం లాంటివాటితో నన్ను చూడడం/పొందడం సాధ్యమైన పనికాదు " అని. తనయందు అచంచలమైన భక్తితో మాత్రమే అది సాధ్యమని తెలియచేసారు.
" యజ్ఞానాం జపయజ్ఞో2స్మి ( భ .గీత 10:25 ) " - యజ్ఞాలలో జపయజ్ఞాన్ని నేను అన్నారు.
స్వయంగా పరమాత్మే జపాన్ని చేసుకో చాలు అనడమే కాకుండా అలా చేసిన త్యాగయ్యను, అన్నమయ్యను, రమణమహర్షిని అనుగ్రహించి కారణజన్ములను చేసారు.
ఓ సారి దగ్గరగా మసిలే ఒకాయన " ఎప్పుడూ ఇక్కడే కూర్చుంటే ఎలాగండి. కేదారినాధ్, బదరినాధ్, హరిద్వార్ అవీ వెళ్ళివస్తే అన్నీ చూసినట్లు ఉంటుంది కదా " అంటే రమణమహర్షి " నాకూ వెళ్ళాలనే ఉంది, ఎక్కడైనా పంచభూతాలు ( భూమి నీరు గాలి నిప్పు ఆకాశం ) కాక 6వది కనిపిస్తే చెప్పు, వెళ్ళి చూసివస్తాను " అన్నారుట. కారణజన్ములు.
గరికిపాటివారు తరచూ అంటూంటారు " దేవుళ్ళకు, నవగ్రహాలకు ఎవరిమీదయినా కోపం ఎందుకు ఉంటుందండీ, వారికి ఆ అవసరమేమిటి " అని.
స్వామి తను ఏమిటో తనకేమి ఇష్టమో చెబుతూ తనకు ఏకాదశి తిధి ఇష్టమన్నారు. వైకుంఠ ఏకాదశి అంటే ఇంకా పవిత్రమయినది. ఆరోజు స్వామిని దర్శించుకుంటే మంచిదని పెద్దలు చెప్పారు. దానిలో తప్పేముంది. వీలయితే తప్పకుండా చేసుకోవచ్చు, తప్పేమీలేదు, పుణ్యంకూడా.
" విశేషేణ గ్రహతి ఇతి విగ్రహం " - విగ్రహము " అంటే విశేషంగా గ్రహించేది అని అర్ధం. కట్టిపడేస్తుంది జీవులని. అందుకని అప్పుడప్పుడు గుడులను దర్శిస్తూ ఉండాలి. విగ్రహారాధన గురించి ఇంకా తెలియాలంటే " వివేకానందుడు మైసూర్ మహారాజాల " మధ్య జరిగిన సంభాషణ గుర్తు చేసుకోవాలి.
అలాగ " వైకుంఠ ఏకాదశి " నాడు తిరుమల వెళ్ళి ఆ దివ్యమంగళరూపాన్ని దర్శించుకుంటానంటే వద్దనేవారు ఎవరు. కాని వెళ్ళేముందు " స్థితప్రజ్ఞత " పొంది కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి - " అక్కడ సౌకర్యాలు బాగుండవు, మంచినీళ్ళుకూడా దొరకవు, 10-12 గంటలు తిండి నీళ్ళు లేకపోయినా నేను నాకుటుంబం కూడా సంతోషంగా చిరునవ్వుతో గడిపేయగలము, ఎండలో గంటలతరబడి నుంచోవాలి, కళ్ళుతిరిగి పడిపోయినా పట్టించుకునే దిక్కుండదు, మన కళ్ళముందరే హిందూమతస్తులుకానివారు, మనదేవుడిమీద నమ్మకం లేనివారు కూడా 100 మందితో ( రాచ పీనుగ ఒంటరిగా పోదు అని సామెత ) వెకిలిగా నవ్వుకుంటూ దర్శనానికి వెళ్ళిపోతూంటారు ". వీటినన్నిటిని " నేను " సమ ( భ.గీత ) " భావంతో తట్టుకోగలను, కోపం అసహనం అనేవి నా డిక్ష్ణరీలోనే లేవు " అనుకునేవారు ఆనందంగా వెళ్ళవచ్చు, తప్పేమీలేదు.
కాని ఆనాడు దర్శనం చేసుకోని వారందరూ పాపులు, అటువంటివారు నరకానికి పోతారు అని ( ఇతర మతాలలోలా ) మాత్రం సనాతనధర్మం ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు, చెప్పదు.
ఈరోజు పవిత్రమైన కార్తీకమాసం ప్రారంభం.
ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదరార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment