భగవద్గీత - 18:37 - సూర్య

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏

" యత్తదగ్రే విషమివ 

  పరిణామే2మృతోపమం, 

  తత్సుఖం సాత్వికం ప్రోక్తం 

  ఆత్మబుద్ధిప్రసాదజం " 

            - భ.గీత 18.37.

" ప్రారంభమునందు విషతుల్యముగా అనిపించినప్పటికిని పరిణామమున అమృతతుల్యమై భగవంతునికి సంబంధించిన విషయములలో నిమగ్నమగునో అట్టి సుఖమును సాత్వికసుఖము అందురు " అని పరమాత్మ తెలియచేసారు.

ఓ పిల్లవాడిని చదువుకోమంటారు తల్లిదండ్రులు, గురువులు. కాని సినీమాలు, సెల్ ఫోనులు, చెడుస్నేహాలు మొదలైనవి ఎంతో ఆనందాన్ని ఇచ్చేవిగాను చదువు విషం, గుదిబండగానూ అనిపిస్తుంది. చదువుమీద శ్రద్ధపెడితే జీవితమంతా ఆనందమయంగా ఉంటుంది. అలాకాక మిగతా విషయాలవైపే మ్రొగ్గితే ఇప్పుడు సంతోషంగా అనిపించినా జీవితమంతా బాధపడవలసి వస్తుంది.

రామకృష్ణపరమహంస అమ్మవారి ఆలయంలో ధ్యానం చేసుకుంటున్నారు ఓరోజు. ఒకాయన వచ్చి గట్టిగా అరుస్తున్నాడు అమ్మవారి ముందు నుంచుని. విషయమేమిటంటే ఆముందరరోజు ఆలయంలో దొంగతనం జరిగింది, అమ్మవారి నగలన్నీ పోయాయి. ఆనగలని సమర్పించినది ఈ అరిచే ఆయనే. " ఆనగలు వేసుకుని ఎంత కళగా ఉండేదానివి. నగలను కాపాడుకునే బాధ్యత నీది కాదా. ఎంత ఖర్చుపెట్టి చేయించాను నగలను " అని అరుస్తున్నాడు. పరమహంస వచ్చి ఇతని చెంప ఛెళ్ళుమనిపించారు. అందరికీ మతిపోయింది. ఆయన అన్నారు " అమ్మవారు నగలు చేయించమని నిన్ను అడిగిందా. నువ్వునగలు ఇవ్వనిక్రితం ఆవిడకి కళతక్కువయిందా. నీకు ఇవ్వాలనిపించింది, శక్తి ఉంది ఇచ్చావు, ఆదొంగకి ఏమవసరం వచ్చిందో పట్టుకుపోయాడు. నువ్వు ఇచ్చావని అమ్మవారికి ఆనందమూలేదు, దొంగ తీసుకుపోయాడని బాధాలేదు. మీ ఇద్దరూ ఆవిడ దృష్టిలో ఒకటే. ఈ నగలతో దొంగ తాత్కాలికంగా సుఖపడినా చెడుపని కారణంగా తరువాత బాధని అనుభవిస్తాడు " అని.

" పద్మపత్రమివాంభసా " ( భ.గీత 5:10 )- తామరాకుమీద నీటిబిందువులాగ ఉంటారు అమ్మవారు.

టిటిడిలో పనిచేసేవారు అదృష్టవంతులు. తనకు దగ్గరగా ఉండి సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించారు స్వామి. అది నిలబెట్టుకోవడం వారి బాధ్యత. మాయలో పడిపోయి తాత్కాలిక ఆనందాలకోసం ( పదోన్నతులు, సంపదలు ) తప్పుదారిలో నడిస్తే తరువాతకాలంలో బాధపడేది వారే. స్వామికేమీ పట్టవు ఈ విషయాలన్నీ. ఆయన డబ్బుని/సంపదలని ఆయనే కాపాడుకోవాలని అంటూంటారు కొందరు, అలా అనుకోవడం అమాయకత్వమే.

స్వామి సేవలో తరించేవారు ఎందరో ఉంటారు. తాత్కాలిక సుఖాలవెంటబడి భ్రష్టుపడిపోయేవారూ ఎందరో ఉంటారు.

ఈరోజు పవిత్రమైన కార్తీకశుద్ధ ఏకాదశి.

అలాంటివారికి కూడా " శుభసంకల్పాలు " కల్పించి తరింపచేయమని పరమాత్మని కోరుకుందాం.

ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదరార్పణమస్తు - సూర్య. 

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ