భగవద్గీత - 18:63 - మతం - సూర్య

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏‌

" మతం - సమ్మతం "

" ఇతితేజ్ఞానమాఖ్యాతం 

  గుహ్యతే గుహ్యతరం  

                 మయా , 

  విమృశ్యైతదశేషేణ 

  యధేచ్ఛసి తధాకురు " 

            - భ.గీత 18:63.

పరమాత్మ " నేను నీకు చెప్పవలసిన రహస్యజ్ఞానమంతా చెప్పాను. ఏదో నేను చెప్పానని కాకుండా దీన్ని సమగ్రంగా నీ బుద్ధితో విమర్శచేసుకుని నీకు తోచిన/నచ్చిన విధంగా ఆచరించు " అన్నారు అర్జునుడితో.

" మతం " అంటే అర్ధం అభిప్రాయం. ఎవరి అభిప్రాయాలు వారివి. ఆశ్చర్యకరంగా ఒకరికే ఇప్పుడున్న అభిప్రాయం మరుక్షణంలో మారిపోవనూ వచ్చు. 

పరమాత్మ గీతలో ( 6:32 ) " అన్నిజీవులను సమభావంతో చూస్తూ సుఖదుఃఖాలను ఒకేవిధంగా స్వీకరించేవాడే పరమశ్రేష్ఠుడైన యోగి అని నా అభిప్రాయం " అన్నారు. ఎంత అద్భుతం. స్వామియే " ఇదే సత్యం అనలేదు, నా అభిప్రాయం మాత్రమే " అన్నారు.

గీతలో పలుచోట్ల " విద్వాంసులు, సాంఖ్యులు ఇలా అభిప్రాయపడ్డారు " అని నొక్కి చెప్పారు.

నపుంసకత్వం, హృదయదౌర్బల్యం వదిలేయి అన్నారు, రాజుగా యుద్ధం చెయ్యడం నీ ధర్మం అన్నారు, అలా చెయ్యకపోతే నిన్ను అపహాస్యం చేస్తారు అందరూ అన్నారు, నువ్వు చెయ్యకూడదు అని నిర్ణయించుకున్నా త్రిగుణాల ప్రభావంతో చెయ్యకుండా ఉండలేవు అన్నారు, భీష్మద్రోణాదులను ఎప్పుడో చంపేసాను ఇప్పుడు నువ్వు చంపు అన్నారు, తనేమిటో విశ్వరూపంలో చూపించి నేను కాలుణ్ణి అన్నారు. మనస్సును అదుపులో ఉంచుకోవడం కష్టమయినా అభ్యాసంతో సాధ్యమే అని చెబుతూ దానికి ఏమి చెయ్యాలో కూడా చెప్పారు. ఇన్ని చెప్పి చివరికి " నేను చెప్పానని కాకుండా నీ బుద్ధిని ఉపయోగించి ఏది మంచిదో అది చెయ్యి " అన్నారు.

అంటే " నా అభిప్రాయం నీ అభిప్రాయం " ఒకటే అవనక్కరలేదు అని స్పష్ఠంగా తెలియచేసారు అర్జునుడికి. ఆయనకే కాదు అందరికీ కూడా.

భీష్ముడిని కూడా ఎప్పుడో చంపేసానన్నారు పరమాత్మ. కాని 58 రోజులు ( భీష్ముడు స్వయంగా ఈ 58 రోజులు వెయ్యి సంవత్సరాలుగా అనిపించాయి అన్నారు ) అంపశయ్యమీద ఉండి పరమపవిత్రమయిన విష్ణుసహస్రాన్ని ఇచ్చిన భీష్ముడిని " నాకు అత్యంత ఇష్టమయిన ఏకాదశుల్లో ఒక ఏకాదశిని నీ పేరుతో జరుపుకుని జనులు పునీతులవుతారు " అని అనుగ్రహించారు. అవ్యాజకరుణామూర్తి.

అందరికీ సుఖసంతోషాలను ప్రశాంతమయిన జీవితాన్ని ప్రసాదించి అనుగ్రహించమని పరమాత్మను వేడుకుందాం.

ఈరోజు పవిత్రమయిన " నాగపంచమి " - శ్రీనవనాగమాతా శ్రీమానసాదేవ్యైనమః.

ఏతత్ సర్వం శ్రీకార్తీకదయాదామోదరార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ