చింతామణిగణపతి 1 - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీరస్తు శుభమస్తు"🙏
చింతామణిగణపతి -1
మాగ్రామంలో " చింతామణిగణపతి " ని ప్రతిష్టించి, నవరాత్రి ఉత్సవాలు మొదలుపెట్టి, 120 సం.లు అయింది. అప్పటినుంచీ గణపతి నవరాత్రులు నిర్విఘ్నంగా, వైభవంగా, నిత్యనూతనంగా జరుగుతున్నాయి.
రాత్రి మహాపూజ, మహానివేదన అయాక మహామంత్రపుష్పం మొదలవుతుంది. అటు 10 మంది, ఇటు 10 మంది నుంచుని చదువుతూంటే మందిరం ప్రతిధ్వనిస్తుంది. చిన్నప్పుడు మేము కూడా " యో2పామాయతనం వేదా " అని అటుప్రక్కవారు అంటే " ఆయతనవాన్ భవతి " అని అందుకునేవారం ఇటుప్రక్కన( ఆ రెండే వచ్చు అప్పుడు )
సాయంత్రం మహాపూజకి 6,7 ప్రసాదాలు అంటే వేయించినసెనగలు, పోచినసెనగపప్పు, కొబ్బరిలస్కోరా లాంటివి ఒక్కొక్క ఇంటినుంచి వచ్చేవి. లస్కోరాకి చెయ్యిచాపితే మాకు ( పిల్లలకు) పెట్టేవారు కాదు, చేతిమీద రాసేవారు, ఎంతకోపం వచ్చేదో.
నాకు ఊహ తెలిసినప్పటినుంచీ రోజూ మధ్యాహ్నం మగవారికి, పిల్లలకి భోజనాలు పెట్టేవారు. నిమజ్జనం/వాలారింపు రోజు మాత్రం ఆడవారికి, కోమట్లకి కూడా భోజనాలు పెట్టేవారు. ఇప్పుడు కొన్ని ఏళ్ళుగా అన్నిరోజులూ ఊరంతా భోజనాలు.
రెండో ఆదివారం ( ఒక ఆదివారమే వస్తే ఆరోజు ) లక్షగరికతో పూజ చేస్తారు స్వామికి. ఆ రోజు 500-600 మంది భోజనాలు చేస్తున్నారు ఇప్పుడు. చుట్టుప్రక్క ఊళ్ళనుంచి కూడా భక్తులు వచ్చి ప్రసాదం తిని వెడుతున్నారు.
మా చిన్నప్పుడు అయితే 9 రోజులూ రాత్రిళ్ళు ఏదో ఒక కార్యక్రమం అంటే హరికధ బుర్రకథ కచేరీలు పిల్లల ( మేము వేసేవారం ) నాటకాలు ఉండేవి. చాలా సందడిగా ఉండేది.
*అసలు స్వామికి " చింతామణిగణపతి " అని పేరు ఎలా వచ్చిందో రేపు తెలుసుకుందాం.*
ఏతత్ సర్వం శ్రీచింతామణీగణపతి అర్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment