శ్రీశంకరజయంతి 2 - సూర్య
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏
శ్రీశంకరజయంతి వేడుకలు భాగ్యనగరం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగాయి. ఆ సందర్భంగా ఓరోజు శ్రీకంచికామకోటి పీఠాధిపతి శ్రీశంకరవిజయేంద్రసరస్వతి మహాస్వామి వారు అనుగ్రహభాష్యం చేసారు.
ఆదిశంకరుల గురించి అద్భుత ప్రవచనం చేసారు.
ఆయనకు కుడిప్రక్క " దరహాసోజ్వలముఖి " కంచికామాక్షి అమ్మవారి చిత్రం, వేదపండితులు ఉంటే ఎడమప్రక్కన పూజ్యులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు ఆశీనులయి ప్రవచనాన్ని శ్రద్ధగా విన్నారు. పీఠాధిపతి సుమారు 2 గంటలు ప్రవచనం చేసి అద్భుతవిషయాలు తెలియచేసారు.
ఆయన తెలియచేసినది అందరూ ఆలోచించవలసినది అయిన ఒక అద్భుతవిషయం - " మనలో ( హిందువుల్లో ) మానసిక ( భావ ) దారిద్ర్యం ఎక్కువయిపోతూంది. ఇదివరకు ఇలా లేదు. మానసికంగా చాలా ధృఢంగా ఉండాలి. ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. మనిషికి. నిరాశ, అత్యాశ రెండూ ఉండకూడదు " అని.
శంకరాచార్యుల తత్వం అందరినీ కలుపుకునిపోయే తత్వం. ఆయన ఎప్పుడూ ఇంకొకరి అభిప్రాయాన్ని ( మతాన్ని ) కించపరచడం, అవమానించడం చేయలేదు. ఆయన అందరూ అంటే పండితులే కాదు పామరులు కూడా తరించాలనే భావన చేసేవారు. అందుకే శివానందలహరి, సౌందర్యలహరి లాంటివేకాకుండా ఎంతో సరళంగా అచ్యుతాష్టకం ( అచ్యుతం కేశవం రామనారాయణం ...), భజగోవిందం లాంటివాటిని మనకు అందించారు. అత్యంత సరళ వాజ్మయం. ఆయన వేదాలలోంచి ఉపనిషత్తులలోంచే కాకుండా పురాణాలలోని పదాలను కూడా అందరికీ త్వరగా చేరువయేలా తీసుకున్నారు. ఆయన స్తోత్రాలు చదివితే మనమే స్వయంగా అయ్యవారికి/అమ్మవారికి విన్నవించుకుంటూన్నట్లుగా ఉంటుంది.
శంకరులు భారతీయతకు ప్రతిరూపం. సంచాలకులు. సంస్థాపకులు.
" ప్రజల్లో దేశభక్తిని సమైక్యతను పెంపొందించాలి. అన్ని మార్గాల్లోకి సన్మార్గమే ఎంచుకోవాలి. సనాతనధర్మం అటువంటి సన్మార్గము. ఎక్కడెక్కడ బలహీనంగా ఉందో, ఆపదలో ఉందో చూసుకుని ఓ రూట్ మేప్ తయారుచేసుకుని మన భాష, సంప్రదాయం, శాస్త్రాలు, దేవాలయాలని అభివృద్ధిచేసుకోవాలి " అని తెలియచేసారు.
" ఇది ప్రభుత్వమే చెయ్యనక్కరలేదు. ప్రజలని భాగస్వాములను చెయ్యాలి. అప్పుడు ప్రజల్లో వికాసం వస్తుంది. అది దేశవికాసానికి, ప్రపంచవికాసానికీ మార్గం ఏర్పరుస్తుంది " అని అద్భుత సందేశం ఇచ్చారు.
ఆయన చెప్పిన ఇంకో అద్భుతవిషయం ఏమిటంటే సంస్కృతమే కాకుండా ప్రాంతీయభాషల్లో ఉన్న అద్భుతవిజ్ఞానాన్ని అక్కడి ప్రజలకు చేరువచెయ్యాలి అని. ఎంతటి అద్భుత విషయం.
అన్నమయ్యకీర్తనలు, త్యాగయ్యకీర్తనలు, వేమన దాశరధి సుమతి మొ.గు శతకాలు ఈకోవలోకి వస్తాయని అనుకోవచ్చు.
ఇది ఇప్పుడు అందరి కర్తవ్యంగా గ్రహించాలి.
సర్వే జనాః సుఖినో భవంతు.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment