" చింతామణి గణపతి - 2 " - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" చింతామణి గణపతి - 2 "
పూర్వం అభిజిత్ అనే చక్రవర్తి సింధుప్రాంతంలోని రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. అతనికి గణుడు అనే కొడుకు ఉన్నాడు. గణుడు విద్యావంతుడు, తపస్సుచేసి ఎన్నో వరాలు శక్తులు కూడా సంపాదించాడు. ఎంతటి శక్తిమంతుడంటే ఇంద్రుడుమీదకు యుద్ధానికి వెళ్ళి జయించి " నీ స్వర్గం నువ్వే తీసుకో, నీకన్నా గొప్పవాడిని అని తెలియచేయడానికే యుద్ధానికి వచ్చాను " అన్నాడు ఇంద్రుడితో.
గణుడు ఓ సారి వేటకు వెళ్ళాడు పరివారంతో. అలసిపోయి ఎక్కడయినా సేదదీరుదామని చూస్తూంటే ఒక ఆశ్రమం కనబడింది. అది కపిలమహర్షి ఆశ్రమం.
మహర్షి వీరిని ఆహ్వానించి " మీరందరూ ఆ నదిలో స్నానం చేసిరండి, మంచి విందు ఏర్పాటు చేస్తాను " అంటే గణుడు మనస్సులో " ఈ మహర్షి విందు అంటున్నారు కాని ఏవో కొన్ని ఫలాలు ఇస్తారేమో తినడానికి. సరే ఏదో ఒకటిలే " అనుకుని స్నానానికి వెళ్ళారు అందరూ.
వారికి వారి జీవితంలో రుచి కాదు కదా విననుకూడా వినని రకరకాల వంటకాలతో పసందైన భోజనం పెట్టారు మహర్షి. గణుడు ఆశ్చర్యపోయి " వంటసాల కూడా కనబడుటలేదు, ఇంత తక్కువ సమయంలో ఇవన్నీ ఎలా ఏర్పాటుచేసారు. మీరు రోజూ ఈ భోజనమే చేస్తారా " అని అడుగుతే మహర్షి " మేము భోజనమే చెయ్యము. ఆకలి తీర్చుకోవడానికి అప్పుడప్పుడు ఓ పండు తింటాం. మీరు మా అతిథులు కనుక ప్రత్యేక విందు ఏర్పాటు చేసాను " అని గణుడి సందేహనివృత్తి కోసం ఇలా చెప్పారు.
ఓ సారి ఇంద్రుడు వచ్చి మహర్షితో " మీరుచేసే అద్భుత యాగాలతో మా శక్తులు పెరుగుతున్నాయి. మీకు ఓ బహుమానం ఇద్దామని వచ్చాను " అని ఓ మణిని ఇచ్చారు. దానిపేరు చింతామణి. ఏది కోరుకున్నా ఇస్తుందని చెప్పారు. " నాకు ఏ సహాయమూ అక్కరలేదు, మణితో పనీ లేదు " అని మహర్షి అంటే ఇంద్రుడు అన్నారు " ఆ విషయం నాకు తెలుసు కాని యాగం చేయాలంటే ఎన్నో సమకూర్చుకోవాలి, పైగా శ్రమతో కూడుకున్నది కనుక మీ సమయం వృధాకాకుండా ఈ మణి చూస్తుంది, అన్ని ఏర్పాట్లు చేస్తుంది, మీరు ఇంకా ఎక్కువగా లోకకళ్యాణం కోసం యాగాలు చేయవచ్చు " అన్నారు. సరే అని తీసుకున్నాను. ఇన్నాళ్ళకు మీ అతిధిమర్యాదలకోసం ఆ మణి ఉపయోగపడింది అనగానే గణుడు " ఆ మణి మీదగ్గర ఉండి ఉపయోగమేముంది, నాలాంటి చక్రవర్తి దగ్గర ఉంటే ప్రజలకు ఉపయోగిస్తుంది. ప్రజలు కష్టపడకుండా ఆనందంగా జీవించవచ్చు " అంటే మహర్షి నేటికీ వర్తించే కొన్ని అద్భుత విషయాలు చెప్పారు.
" రాజా నీ ఆలోచనే తప్పు. ఎవరైనా సరే తన తిండికోసం, సుఖాలకోసం కష్టపడి సంపాదించుకోవాలి. ఊరికే వచ్చేదానికి అలవాటుపడితే ప్రజలు సోమరులు అవుతారు. సమయం ఎలా గడపాలో తెలియక వ్యసనాలకు అలవాటు పడతారు. దొంగతనాలు హత్యలు చేస్తారు. ఆ కారణంగా జాతి నిర్వీర్యమై రాజ్యం/దేశం భ్రష్టు పట్టిపోతుంది " అంటారు మహర్షి. ఎంతటి అద్భుత సందేశం.
**ఈనాటి ప్రభుత్వ ఉచితపథకాలకు భవిష్యత్తులో జరగబోయేది ఇదే. వేల సంవత్సరముల క్రితమే మన ఋషుల దృక్పథం ఇది. అదీ మన సనాతనధర్మం గొప్పదనం.*
అయినా రాజు మూర్ఖుడు కనుక చింతామణిని మహర్షి దగ్గరనుంచి బలవంతంగా లాక్కుని తీసుకునిపోతాడు గణుడు.
*తరువాత జరిగినది రేపు తెలుసుకుందాం.*
ఏతత్ సర్వం శ్రీచింతామణీగణపతి అర్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment