విష్ణుసహస్రం - 2 - సూర్య
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏
" వ్యవసాయో వ్యవస్థానః,
సంస్థానో స్థానదో ధృవః ".
శ్రీవిష్ణుసహస్రనామాలలో ఈ నామాలు వస్తాయి. " వ్యవసాయః " అంటే " మానవాళి అభ్యున్నతికి కృషి చేసేవారు " అని అని భాష్యం చెప్పారు ఆదిశంకరాచార్యులు. ఎంతటి అద్భుతమైన నామం మరియు భాష్యం.
పంటలు పండించడాన్ని వ్యవసాయమని, పండించేవారిని వ్యవసాయదారులని ఎంత అద్భుతమైన పేర్లు పెట్టుకున్నాం. ఉదయంలేస్తే రాత్రి పడుకునేవరకూ ఎంతటి కోటీశ్వరుడికైనా వ్యవసాయదారుడే దిక్కు. ఏపని చెయ్యాలన్నా శక్తి కావాలికదా.
అధర్వణవేదంలో ఓ మంత్రం ఉంది. దాని అర్ధం " నాగళ్ళతో దున్నాలి, విత్తులు నాటాలి, కంకులు పండాలి " అని. ఎలా పండాలంటే " బరువుతో కంకులు వంగిపోవాలి " అని కూడా చెప్పింది వేదం.
రుద్రచమకంలో " అన్నంచ మే, అక్షుశ్చ మే, వ్రీహయశ్చ మే, యవాశ్చ మే, మాషశ్చ మే, తిలాశ్చ మే, ముద్గాశ్చ మే, ఖల్వాశ్చమే గోధూమాశ్చ మే...." - అంటే వరి, మినుములు, నువ్వులు, గోధుమలు ప్రసాదించుస్వామీ అని. ఇంకోచోట " ఓషధశ్చ మే, కృష్టపచ్యంచ మే, అకృష్టపచ్యంచ మే " అంటే ఓషధులు - దున్ని పండించేవీ, దున్నకుండా వర్షాధారంతో పండేవీ రెండింటినీ - ఇయ్యి స్వామీ అని.
మహాభారతం అంటే జూదం, వస్త్రాపహరణం, యుద్ధమే అనుకుంటారు. ఎన్నో సంవాదాలు, పిట్టకధలద్వారా ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పారు వ్యాసర్షి. శాంతిపర్వంలో భృగుమహర్షి, భరద్వాజమహర్షి ల సంవాదం ఉంది. అది వృక్షాలకు సంబంధించినది. అది తెలియచేస్తూన్నదేమిటంటే వృక్షాలకు " స్పందన, స్పర్శ, దృశ్యం, వినికిడి " లాంటివన్నీ ఉన్నాయి అని. ఇదేవిషయాన్ని మన " జగదీష్ చంద్రబోస్ " శాస్త్రీయంగా నిరూపించారు.
వివేకానందుడు అంటారు " మన ఋషులు తమ తపోశ్శక్తితో అంతర్ముఖులై ప్రకృతిని బాధించకుండా చెప్పిన విజ్ఞానాన్ని నేడు శాస్త్రజ్ఞులు బహిర్ముఖులై ప్రకృతిని బాధిస్తూ నిరూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు " అని. ఎంత అద్భుత విషయం.
మన " ఋషులజ్ఞానానికి, సనాతనధర్మానికి " సాటి ఏదీ లేదు, ఉండబోదు/రాబోదు.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment